కాంగ్రెస్ న‌మ్మ‌క‌ద్రోహం.. యూస‌ఫ్ ఖాన్ కి ద‌క్క‌ని టికెట్

by Ratna Kumari |

పదవుల కోసం గడపలు తొక్కే రాజకీయ కాలంలో దాదాపు 15 సంవ‌త్స‌రాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి, జెండా మోసిన నిఖార్సైన కార్యకర్త యూసఫ్ ఖాన్ కు తీరని అన్యాయం జరిగింది.

కాంగ్రెస్ న‌మ్మ‌క‌ద్రోహం.. యూస‌ఫ్ ఖాన్ కి ద‌క్క‌ని టికెట్
X

దిశ, కాగజ్‌నగర్ : పదవుల కోసం గడపలు తొక్కే రాజకీయ కాలంలో దాదాపు 15 సంవ‌త్స‌రాలుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి, జెండా మోసిన నిఖార్సైన కార్యకర్త యూసఫ్ ఖాన్ కు తీరని అన్యాయం జరిగింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకత్వం అనుసరించిన తీరుపై ఇప్పుడు స్థానిక కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

ప్రతిపక్షంలో పోరాటం.. అధికారంలో విస్మరణ

యూసఫ్ ఖాన్ గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. కేసులు భరించారు. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే, తీరా మున్సిపల్ ఎన్నికల వేళ ఆయనను కాదని, నిన్నగాక మొన్న బీఆర్ఎస్ నుంచి వ‌ల‌స‌ వచ్చిన వ్యక్తికి కౌన్సిలర్ టికెట్ కేటాయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అన్యాయం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని యూసఫ్ ఖాన్ బహిరంగంగానే ఆరోపించారు. నేను పార్టీని నమ్ముకున్నాను, కానీ నాయకులు నన్ను నమ్మించి మోసం చేశారు. 15 ఏళ్ల నా కష్టానికి, త్యాగానికి ఇచ్చే విలువ ఇదేనా? అని ఆయన కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వలస నాయకుల కోసం సొంత పార్టీ క్యాడర్‌ను తొక్కివేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీ చేసిన వంచనకు కుంగిపోకుండా, యూసఫ్ ఖాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఆత్మగౌరవం కోసం, వార్డు ప్రజల నమ్మకం కోసం ఇండిపెండెంట్ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీకి దిగారు.

"నన్ను మోసం చేసింది పార్టీ నాయకత్వం మాత్రమే. కానీ 9వ వార్డు ప్రజలు కాదు. 15 ఏళ్లుగా నేను చేసిన సేవకు ప్రజలే తీర్పు చెబుతారు. ఈ పోరాటం నా ఆత్మగౌరవం కోసం" అని యూసఫ్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. యూసఫ్ ఖాన్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా టికెట్ కేటాయింపులో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ దండే విట్టల్‌కు పెద్ద సవాల్‌గా మారింది. నిఖార్సైన కార్యకర్తను దూరం చేసుకోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈ ఎన్నికలు చూపిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యూసఫ్ ఖాన్ చేసిన ఈ "ఆవేదన భరిత రోదన" కేవలం ఒక వ్యక్తిది కాదు, పార్టీని నమ్ముకున్న వేలాదిమంది కార్యకర్తల ఆత్మఘోషకు నిదర్శనంగా మారింది.

Next Story