బీఆర్ఎస్‌లో టికెట్ల లొల్లి.. మంత్రి చెంతకు చేరిన ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ..

by Disha Web Desk 6 |
బీఆర్ఎస్‌లో టికెట్ల లొల్లి.. మంత్రి చెంతకు చేరిన ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ..
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా అధికార భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అంతర్గత పోరు తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెంతకు చేరిందని సమాచారం. గురువారం ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గంలో పార్టీలో నెలకొన్న అసంతృప్తి వ్యవహారం హైదరాబాద్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఆ నియోజకవర్గాల్లో టికెట్ల లొల్లి మొదలైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి స్పష్టంగా ఆదిలాబాద్, బోథ్ రెండు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. పార్శ్వంగా కొన్ని మండలాలు ఖానాపూర్. ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో చేరాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్ర శాసనసభ్యుడు జోగు రామన్న చెప్పేది వేదంగా నియోజకవర్గంలో రాజకీయాలు సాగుతున్నాయి. బోథ్ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆ నియోజకవర్గంలో మాత్రమే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కానీ ఆయన నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తలదూరుస్తారన్న ప్రచారం ఉంది. అయితే తాజాగా ఈ రెండు నియోజకవర్గాల్లో వారికి కాకుండా టికెట్ తమకు ఇవ్వాలని లేదంటే ఇతరులకు ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వద్దకు వెళ్లినట్టు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.

జోగుపై లోక గుస్సా..!

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపై పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు డెయిరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లోక భూమారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారని సమాచారం. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా ఉన్నప్పటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నానని వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు. రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి ఆదిలాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రంగినేని మనీషా పవన్ రావ్ తదితరులతో కలిసి లోక భూమారెడ్డి టికెట్ రాజకీయాలు ప్రారంభించినట్లు ప్రచారం మొదలైంది. తాజాగా ఇదే అంశాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిష్టానం వద్దకు నియోజకవర్గంలో ఉన్న గ్రూపు విభేదాలను అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు వివరించాలని కోరినట్లు సమాచారం. అయితే విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని టికెట్ ఎవరికి వచ్చిన సంయమనం పాటించాలని మంత్రి ఈ సందర్భంగా సూచించినట్లు తెలిసింది.

రాథోడ్ పై గోడం గుర్రు..?

మరోవైపు బోథ్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కు టికెట్ రాకుండా ప్రత్యర్థి వర్గం పావులు కదుపుతోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు గోడం నగేష్ వ్యూహాత్మకంగా టికెట్ రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు అధికంగా ఉన్నందున తనకు అవకాశం కల్పించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలో నేరేడిగొండ జెడ్పీటీసీ అనిల్ యాదవ్ బోత్ ఎంపీపీ తులా శ్రీనివాస్ తదితరులు కూడా ఎమ్మెల్యే బాపురావును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో బాపూరావు కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే విషయంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు లోక భూమారెడ్డి కూడా బాపురావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికలకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు ఉండగా.. అధికార పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా వివాదం తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వద్దకు వెళ్లడం ఆయన అధిష్టానం దృష్టికి ఎలాంటి సమాచారం ఇస్తారన్న అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది.


Next Story

Most Viewed