జెడ్పీ ఉత్కంఠ.. మే చివరిలో ఎన్నికలు ఉంటాయని సంకేతాలు

by Batti.Sumithra |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మే నెల చివరి నాటికి జెడ్పీ ఎన్నికలు జరుగుతాయన్న సమాచారంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

జెడ్పీ ఉత్కంఠ.. మే చివరిలో ఎన్నికలు ఉంటాయని సంకేతాలు
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మే నెల చివరి నాటికి జెడ్పీ ఎన్నికలు జరుగుతాయన్న సమాచారంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకగా తీసుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. నిర్మల్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలు బలంగా ఉండడంతో ఆ పీఠాన్ని దక్కించుకోవాలని కమలం పార్టీ పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం తన సీనియర్ నాయకుల బలంతో నిర్మల్ జెడ్పీ చైర్మన్ పదవిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని సీరియస్‌గా ఉంది. మంచిర్యాలలో ముగ్గురు ఎమ్మెల్యేల అండతో కాంగ్రెస్ ధీమాగా ఉండగా, బీఆర్ఎస్ అక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో తమకున్న ఎమ్మెల్యేల బలంతో జెడ్పీ స్థానాలను నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆసిఫాబాద్‌లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొనే అవకాశం ఉండగా, కాంగ్రెస్ అక్కడ పుంజుకోవాలని చూస్తోంది.

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్ ఎన్నికల పై ప్రధాన రాజకీయ పార్టీలు తమ దృష్టిని కేంద్రీకరించాయి. మే నెల చివరి నాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న సంకేతాల నేపథ్యంలో, ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో అంతర్గతంగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు సైతం తమకు పట్టున్న జిల్లాలో ఎలాగైనా జడ్పీ స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను జిల్లాల పార్టీ ఇన్చార్జిలకు అప్పగించినట్లు సమాచారం.

నాలుగు జిల్లాల పై పార్టీల దృష్టి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలలో పార్టీల బలాబలాలను బట్టి జడ్పీ స్థానాలను గెలుచుకోవాలని నేతలు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధిష్టానం సీరియస్‌గా ఉంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా నిర్మల్ జడ్పీ స్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. జిల్లాలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నప్పటికీ, నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకుల బలం చూసుకుని జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

మంచిర్యాల, ఆదిలాబాద్ సమీకరణాలు

మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ సహా ముగ్గురు శాసనసభ్యులు ఉన్న నేపథ్యంలో, ఆ జడ్పీ స్థానాన్ని కచ్చితంగా కైవసం చేసుకోవాలన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది. కానీ, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బలంగా ఉండటంతో, ఆ రెండు స్థానాలపై గులాబీ పార్టీ గురి పెట్టింది. ఆసిఫాబాద్ జిల్లాలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సమానంగా పోటీ పడుతుండగా, అక్కడ కాంగ్రెస్ బలం కొంత తక్కువగా కనిపిస్తోంది. ఆదిలాబాద్‌లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఎలాగైనా ఆ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఒక నియోజకవర్గ ఇన్చార్జి అయితే రిజర్వేషన్ కలిసి వస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే జడ్పీ ఎన్నికల్లోనే ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Next Story