కాగజ్‌నగర్‌లో మళ్ళీ అక్రమ రవాణా దందా వెలుగులోకి..

by Kodari Anjali |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సరిహద్దుల్లో అక్రమార్కుల ఆగడాలు శృతిమించుతున్నాయి.

కాగజ్‌నగర్‌లో మళ్ళీ అక్రమ రవాణా దందా వెలుగులోకి..
X

దిశ, కాగజ్‌నగర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సరిహద్దుల్లో అక్రమార్కుల ఆగడాలు శృతిమించుతున్నాయి. చట్టాన్ని బొటనవేలి కింద నొక్కుతూ, అధికార యంత్రాంగాన్ని తమ జేబులో వేసుకుని దందారాయుళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో కాగజ్‌నగర్ పరిధిలో ఓ డీసీఎమ్‌ (DCM) వాహనంలో అత్యంత దారుణంగా, ఊపిరి ఆడని రీతిలో తాళ్లతో కట్టేసి 19 పశువులను కుక్కి కౌటాల నుండి బైంసాకు తరలిస్తుండగా కాగజ్ నగర్ చెక్ పోస్ట్ వద్ద ఈ అక్రమ రవాణా ను బట్టబయలు చేసేందుకు చెక్ పోస్ట్ వద్ద కొమ్ముగాసుకొని కొందరు అధికారులు ఉన్నారని తెలుసుకున్న ఈదలారి మాజీ కౌన్సిలర్ గ్యాంగ్, సరిహద్దు రాష్ట్రాల నుండి డీసీఎం వ్యాన్ మరియు బొలెరో వాహనంను మాజీ కౌన్సిలర్ పార్ట్నర్ అయినటువంటి వ్యక్తి ఇంటిలో దీన్ని జాగ్రత్తగా దాచి పెట్టారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి అక్రమంగా తరలిస్తున్న పశువులను డీసీఎం వ్యాన్ చూసి ఎటువంటి పత్రాలు ఏమి లేక పోవడం తో పశువులను గోశాల కు తరలించి వ్యాన్ ను సీజ్ చేశారు..

మామూళ్ల మాయాజాలం.. మాజీ కౌన్సిలర్ చక్రం

ఈ అక్రమ పశువుల రవాణా వెనుక స్థానిక రాజకీయాల్లో చక్రం తిప్పిన ఒక మాజీ కౌన్సిలర్ హస్తం ఉన్నట్లు బలమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమాలను అడ్డుకోవాల్సిన ఒక కీలక అధికారిని సదరు మాజీ నాయకుడు లక్షల రూపాయల మామూళ్లతో తన కనుసన్నల్లో ఉంచుకున్నట్లు తెలుస్తోంది. నెలనెలా భారీగా నజరానాలు సమర్పిస్తూ, అర్ధరాత్రి వేళల్లో ఈ అక్రమ దందాను నిరాటంకంగా నడిపిస్తున్నట్లు సమాచారం.

అధికారే ఇన్ఫార్మర్ల...

లంచాల మత్తులో తూగుతున్న సదరు క్షేత్రస్థాయి అధికారి కేవలం కళ్లు మూసుకోవడమే కాకుండా, అక్రమార్కులకు రక్షణ కవచంగా మారారనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడెక్కడ శాఖల తనిఖీలు జరుగుతున్నాయో గమనించి, ఆ సమాచారాన్ని క్షణాల్లో పశువుల వ్యాపారులకు చేరవేస్తూ 'ఇన్ఫార్మర్' పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి వాహనాలు పట్టుబడితే, వారిని తప్పించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయడంలోనూ ఈ అధికారే కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మూగజీవుల ఆర్తనాదాలు.. కంటికి నీళ్లు తెప్పించే దృశ్యాలు

దళారులు కేవలం లాభాల కక్కుర్తితో పరిమితికి మించి, నిలబడటానికి కూడా వీలు లేని విధంగా పశువులను డీసీఎంలో కుక్కేశారు. గాలి ఆడక, ఒకదానిపై ఒకటి పడి ఆ నోరులేని మూగజీవులు పెట్టిన ఆర్తనాదాలు కంటికి నీళ్లు తెప్పించేలా ఉన్నాయి.

జిల్లా యంత్రాంగం స్పందించాల్సిందే!

శాంతిభద్రతలను కాపాడాల్సిన అధికారులే లంచాలకు కక్కుర్తి పడి అక్రమార్కులకు కొమ్ముకాస్తే వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపాలని, లంచగొండి అధికారిపై మరియు అక్రమ రవాణాకు పాల్పడుతున్న సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story