రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం పాటుపడతా : ఎమ్మెల్యే రామారావు పటేల్

by Batti.Sumithra |

రాజకీయాలకు అతీతంగా ముధోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం పాటుపడతా : ఎమ్మెల్యే రామారావు పటేల్
X

దిశ, భైంసా : రాజకీయాలకు అతీతంగా ముధోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. మంగళవారం కుబీర్ మండలంలోని మాలేగాం గ్రామంలో భైంసా నుండి మిర్జాపూర్, లింగా, కుంబి, నిగ్వ మహారాష్ట్ర బోర్డర్ వరకు రూ.20 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గత పది సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న రహదారిని బాగు చేస్తున్నామని తెలిపారు. దశలవారీగా గ్రామీణ రోడ్లను మెరుగుపరుస్తానని, అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. బాసర ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోతే మంత్రి కొండా సురేఖ సమక్షంలో భిక్షాటన చేసైనా ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి కోసం ప్రోటోకాల్ ప్రకారం అందరినీ విన్నవిస్తూ దశలవారీగా నిధులు తెచ్చుకుంటున్నామని తెలిపారు.

అయితే ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వద్ద కొంతమంది సర్పంచ్‌లు ప్రొసీడింగ్స్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా సర్పంచ్‌లు వ్యవహరించాల్సిందిగా సూచించారు. తప్పు చేస్తే తాను చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అభివృద్ధి పనులు చేయడానికి ఎప్పుడూ స్వాగతిస్తానని, కానీ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన వద్ద ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, రాజకీయాలకు అతీతంగా అందరి పనులు చేస్తానని తెలిపారు. సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం తనపై ఉందని, తన హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రెండున్నర సంవత్సరాల్లో పార్టీలకు అతీతంగా నాలుగు వేల మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Next Story