ఆయిల్ ఫామ్ పంటతో అధిక లాభాలు...

by Taduka Kalyani |

రైతులు ఆయిల్ ఫామ్ పంటను వేసి అధిక లాభాలు సాధించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు.

ఆయిల్ ఫామ్ పంటతో అధిక లాభాలు...
X

దిశ, భైంసా : రైతులు ఆయిల్ ఫామ్ పంటను వేసి అధిక లాభాలు సాధించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. మంగళవారం పట్టణంలోని శ్రీ బాంకెట్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ పంట వేయాలని రైతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని సద్వినియోగం చేసుకొని పంట వేయాల్సిందిగా సూచించారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 4200 ఎకరాల్లో రైతులు పంటను వేయడం జరిగిందన్నారు. పంట వేసినప్పటినుండి మూడు సంవత్సరాల వరకు అంతర పంటలు వేసుకోవచ్చాన్నారు. 20 వేల ఎకరాల వరకు పంట వేస్తే భవిష్యత్తులో మన ప్రాంతం లో ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ పథకంలో రైతుల కోసం ఎన్నో స్కీమ్ లు ఉన్నాయని వాటిని వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పంట మార్పిడితో రైతులు లాభాల బాట పడతారని ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని, రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడితే ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదకరమన్నారు. అనంతరం కార్యక్రమం లో ఉత్తమ రైతులను సన్మానించారు. అధికారులు ఆయిల్ ఫామ్ పంట పై ప్రెజెంటేషన్ ఇచ్చి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థాళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ బాలు నాయక్, ఎడిఎ లు వీణ శ్రీనివాస్ రాజు, ఉద్యానవన శాఖ అధికారి జావీద్ పాషా, వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు సర్పంచ్ లు రైతులు పాల్గొన్నారు.

Next Story