- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకులాల్లో భద్రత ఏది? నరకకూపాలుగా ఆశ్రమ పాఠశాలలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ లోపించి విద్యార్థుల భద్రత, ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారాయి. గత ఏడాది వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో భయపడిన విద్యార్థులకు ఈ ఏడాది హాస్టళ్లలో భద్రతా లోపాలు, తోటివారి వేధింపులు సరికొత్త నరకాన్ని చూపుతున్నాయి.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ లోపించి విద్యార్థుల భద్రత, ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారాయి. గత ఏడాది వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో భయపడిన విద్యార్థులకు ఈ ఏడాది హాస్టళ్లలో భద్రతా లోపాలు, తోటివారి వేధింపులు సరికొత్త నరకాన్ని చూపుతున్నాయి. రెబ్బెన, కాగజ్‌నగర్, కెరమెరి హట్టి గురుకులాల్లో గడిచిన 15రోజుల్లో జరిగిన వరుస ఘటనలు విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యార్థిని గోడ దూకి పారిపోవడం, తోటి బాలిక నోట్లో బలవంతంగా పెన్ క్యాప్ వేయడం వంటి సంఘటనలు ఇక్కడి సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. మరోవైపు హట్టి ఆశ్రమ పాఠశాలలో ముద్ద అన్నం, నీళ్ల పప్పు పెడుతున్నారంటూ రాత్రివేళ విద్యార్థులు తిండి తినకుండా నిరసన తెలపడం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికైనా ఐటీడీఏ ఉన్నతాధికారులు స్పందించి, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించడంతోపాటు విద్యార్థులకు పటిష్ట రక్షణ కల్పించాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.
దిశ, ఆసిఫాబాద్
దిశ, ఆసిఫాబాద్ : గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్వహణ వైఫల్యాలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో హడలెత్తిపోయిన విద్యార్థులకు ఈ ఏడాది భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది కళ్లు కప్పి విద్యార్థులు హాస్టళ్ల నుంచి పారిపోతుండడంతోపాటు తోటి విద్యార్థులపైనే వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. సాధారణంగా నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు అందుతాయనే ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పిస్తుంటే జిల్లాలోని రెబ్బెన, కాగజ్‌నగర్, కెరమెరి హట్టి గురుకులాల్లో గడిచిన 15రోజుల వ్యవధిలో జరిగిన మూడు వేర్వేరు సంఘటనలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
భద్రత గాలికి...
జూన్ 25న రెబ్బెన మండలంలోని గురుకుల హాస్టల్ నుంచి ఓ ఇంటర్ విద్యార్థిని ప్రహారీ గోడ దూకి వెళ్లిపోయింది. జూలై 5న కెరమెరి మండలంలోని హట్టి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి 4, 5, 6 తరగతులు చదువుకునే ముగ్గురు చిన్న పిల్లలు సిబ్బంది కళ్లు కప్పి హాస్టల్ నుంచి ఉడాయించారు. జూలై 4న కాగజ్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో తోటి విద్యార్థులే ఓ బాలిక కళ్లకు గంతలు కట్టి, గట్టిగా పట్టుకుని నోట్లోకి బలవంతంగా పెన్ క్యాప్‌ను మింగించారు. ఈ వరుస ఘటనలు హాస్టళ్లలో రక్షణ చర్యల డొల్లతనాన్ని ఎండగడుతుండగా వార్డెన్లు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముద్ద అన్నం, నీళ్ల పప్పు.. పిల్లల నిరసన...
కెరమెరి మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం రాత్రి భోజనం నాసిరకంగా ఉందంటూ విద్యార్థులు రాత్రి 10:30 గంటల వరకు నిరసన తెలిపారు. వండిన అన్నం ముద్దగా మారిందని, పప్పు, ఆలూ కూర మొత్తం నీళ్లలా ఉండి ఉప్పు, కారం కూడా లేవని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భోజనాన్ని చెత్తకుండీలో పారేశారు. నెల రోజులుగా ఇక్కడ సరైన మెనూ పాటించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. వారం రోజుల కింద ఇక్కడ ఇడ్లీ తిని 27మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గుర్తుచేశారు. ఈ విషయంలో గతంలోనే హెచ్‌ఎంకు మెమో జారీ చేసినా మెనూ పద్ధతిలో మార్పు రాలేదని మండిపడ్డారు. చివరకు ఐటీడీఏ పీవో ఫోన్ ద్వారా సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పిల్లలు తమ ఆందోళనను విరమించారు.
అధికారులు తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి
గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు పౌష్టికాహార మెనూ అందడం లేదు. ఉన్నతాధికారులు తక్షణమే హాస్టళ్లను తనిఖీ చేయాలి. బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- దుర్గం దినకర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, సీపీఎం






