అసంతృప్తుల చూపు.. కవిత వైపేనా..!?

by Batti.Sumithra |

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త రాజకీయ వేదిక బలపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అసంతృప్తుల చూపు.. కవిత వైపేనా..!?
X

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుతో కొత్త రాజకీయ వేదిక బలపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీని వీడి పలువురు అసంతృప్త నేతలు ఈ కొత్త పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పరిణామాలు వేగంగా మారుతున్నాయని, పాత రాజకీయ సమీకరణాలు కొత్త రూపం దాల్చుతున్నాయని స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోడ జనార్దన్ టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. శుక్రవారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితను ఆయన కలవడం చర్చకు దారితీస్తోంది. దీంతో జిల్లాలో టీఆర్ఎస్ బలం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలువురు నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, కొందరు నాయకులు తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త రాజకీయ వేదిక కోసం ఎదురుచూస్తున్న నేతలకు టీఆర్ఎస్ పార్టీ ఆశాకిరణంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ అసంతృప్తుల చూపు టీఆర్ఎస్ వైపు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లో టికెట్ల పంపిణీ, స్థానిక నాయకత్వ విభేదాలు, పదవుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పలువురు నేతలు ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలో గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పనిచేసిన నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు పై స్పష్టత కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ వారికి కొత్త అవకాశంగా కనిపిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీకి పునాది స్థాయిలో బలం చేకూర్చే సామాజిక వర్గాల నేతలను లక్ష్యంగా చేసుకుని సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా యువ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, టికెట్ ఆశావహులు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

బోథ్ మాజీ ఎమ్మెల్యే చేరికతో చర్చ..

ఇటీవలే బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కల్వకుంట్ల కవిత పార్టీ వైపు అడుగులు వేయడం జిల్లాలో రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. స్థానికంగా ఆయన పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండగా.. బాపూరావు చేరికతో టీఆర్ఎస్ పార్టీకి జిల్లా స్థాయిలో బలం పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. బాపూరావుతో కలిసి గతంలో పనిచేసిన నాయకులు తిరిగి ఆయన చెంతకు చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ కు ఒకింత నష్టం చేకూర్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బోథ్, ఆదిలాబాద్ నియోజవర్గాలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ చేరిక ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చని చెబుతున్నారు.

మరికొందరు కీలక నేతలతో సంప్రదింపులు..

బోథ్ మాత్రమే కాకుండా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల స్థాయి కీలక నేతలతో కూడా సంప్రదింపులు కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు ఇప్పటికే అనధికారికంగా మద్దతు ప్రకటించగా, మరికొందరు సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన స్థానం, భవిష్యత్ ఎన్నికల్లో అవకాశాలు, స్థానిక నాయకత్వంలో ప్రాధాన్యం వంటి అంశాల పై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే మరికొన్ని కీలక చేరికలు జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

బీఆర్ఎస్‌కు రాజకీయ సవాలే..

ఈ పరిణామాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గణనీయమైన నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీకి కేడర్ స్థాయిలో పనిచేసిన నేతలు, ప్రభావం ఉన్న స్థానిక నాయకులు కొత్త పార్టీ వైపు వెళ్లితే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ పై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. గ్రామస్థాయిలో బలమైన నాయకత్వం కోల్పోతే భవిష్యత్ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తలెత్తవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ బలపడుతున్న సమయంలో ఇప్పుడు టీఆర్ఎస్ రూపంలో మరో రాజకీయ ప్రత్యామ్నాయం రావడం బీఆర్ఎస్‌కు మరింత సవాల్‌గా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వరుస ఓటములు ఆ పార్టీ క్యాడర్ లో అసంతృప్తి రాజేస్తున్నట్లు తెలుస్తోంది.

రానున్న ఎన్నికల పై ప్రభావం..

ఈ రాజకీయ మార్పులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంట్, అసెంబ్లీ రాజకీయాల పై కూడా ప్రభావం చూపే అవకాశముంది. జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రతి పార్టీ తన వ్యూహాలను పునఃసమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కవిత కొత్త పార్టీ జిల్లా స్థాయిలో ఎంత ప్రభావం చూపుతుందో, ఎవరెవరు ఈ వేదికలో చేరతారో అన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. రాబోయే రోజుల్లో జరిగే చేరికలు ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయ దిశను నిర్ణయించే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.




Next Story