గ్రామాల సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభల నిర్వహణ : కలెక్టర్

by Batti.Sumithra |

గ్రామాల సమస్యల పరిష్కారమే గ్రామ సభల నిర్వహణ ముఖ్య ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

గ్రామాల సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభల నిర్వహణ : కలెక్టర్
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : గ్రామాల సమస్యల పరిష్కారమే గ్రామ సభల నిర్వహణ ముఖ్య ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ గ్రామ పంచాయతీ భవన ఆవరణలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు తదితర ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, దీని ద్వారా ఎందరో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. దాదాపు జిల్లాలో 60 వేల రేషన్ కార్డులను ఇచ్చారని అన్నారు. గ్రామసభల ద్వారా గ్రామాల్లో గల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కలెక్టర్ వివరించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించి, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలని అన్నారు.

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులన్నీ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి గ్రామాలు పట్టణాలు అన్ని పరిశుభ్రంగా మార్చామని వివరించారు. అతిత్వరలోనే వైద్య కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అధికారులంతా జవాబుదారీతనంతో పని చేస్తూ, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా వ్యవహరించాలని తెలిపారు. గ్రామసభలో భాగంగా, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన గ్రామస్తుల వివరాలు చదివి వినిపించారు. ప్రజల కొరకు ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాలను గురించి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు అన్ని పథకాలను సద్వినియోగపరుచుకోవాలని చెప్పారు. గ్రామసభలో డీపీఓ శ్రీనివాస్, తహశీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వనిత, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story