పర్యాటకం పగటి కలేనా?

by velandi.Saikiran |

కాశ్మీర్ వెళ్లే పనిలేదు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణులను చుట్టి వస్తే చాలు.! అంటూ

పర్యాటకం పగటి కలేనా?
X

దిశ ప్రతినిధి నిర్మల్ : కాశ్మీర్ వెళ్లే పనిలేదు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణులను చుట్టి వస్తే చాలు.! అంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు పాలకులు ఇస్తున్న హామీలు పగటి కలలుగానే మిగిలిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే సమైక్య ఆంధ్రప్రదేశ్ సహా పక్కనే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, కర్ణాటక రాష్ట్రాలకు ఒక గొప్ప అనుభూతిని ఇచ్చే పర్యాటక జిల్లాగా పేరు ఉంది. ఉన్న పర్యాటక కేంద్రాలను కాస్త అభివృద్ధి చేస్తే దేశంలోనే గొప్ప పర్యాటక జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కీర్తి వస్తుంది. కానీ, పాలకులు ఆ దిశగా కనీస చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాక ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. దీంతో ప్రభుత్వాలు, పాలకులపై జిల్లావాసుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నెన్నో అందాలు...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల ఖిల్లాగా పేరు ఉంది. 60శాతం పైగా అడవులు విస్తరించి ఉన్న జిల్లా కావడంతోపాటు అనేక జలపాతాలు, సెలయేరులు జిల్లాలో విస్తరించి ఉన్నాయి. దీనికి తోడు అనేక చారిత్రాత్మక ప్రదేశాలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం విశేషం. అంతటి మహోన్నత ఆదిలాబాద్ జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దే విషయంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడంలో చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదిమ గిరిజన ఆరాధ్య దైవం కొమురం భీమ్ జన్మించిన జోడెన్ ఘాట్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఇంకా ఆచరణకు నోచుకోలేదు. మ్యూజియం పనులు మినహా ఇతర అభివృద్ధి పనులు జరగడం లేదు. ఆ ప్రాంతానికి ఉట్నూరు లేదా ఆసిఫాబాద్ మీదుగా కెరామెరి ఘాట్స్ మీదుగా వెళ్తే కాశ్మీర్ వెళ్లినట్లే. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాలు కనువిందు చేస్తాయి. జైనాథ్ సూర్య దేవాలయం, నాగోబా ఆలయం, ఉట్నూర్ గోండుల జిల్లా, సిర్పూర్ పేపర్ మిల్లు, సింగరేణి కోల్ మైన్స్, బాసర అమ్మవారి క్షేత్రం, నిర్మల్ కొయ్య బొమ్మలు, కడెం కవ్వాల్ అభయారణ్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనీసం 20కి పైగా మంచి పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటిని తీర్చిదిదితే కనీసం మూడు నుంచి నాలుగు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటకులు గడపడంతోపాటు, మంచి అనుభూతిని పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా ఉమ్మడి జిల్లాలో పర్యాటకం పడకేస్తున్నది.

100 కోట్ల ప్లాన్ ఉట్టిదేనా..?

గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి రూ.100కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అది ఉట్టిదేనని తేలిపోయింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సైతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై సమీక్ష జరిపారు. గతంలో మాదిరిగా కాకుండా తాము కచ్చితంగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి జిల్లాకు చెందిన 10మంది ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు రాజకీయాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి మంత్రి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి నిధుల మంజూరుకు ఒత్తిడి చేస్తే కచ్చితంగా నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Next Story