- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం భరోసా.. లొంగిపోయిన సభ్యులకు ఇళ్ల స్థలాల పంపిణీ
గతంలో లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు ఇవాళ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పంపిణీ జరిగింది.

దిశ, ఆదిలాబాద్: గతంలో మావోయిస్టు కార్యకలాపాలకు దూరమై జనజీవన స్రవంతిలో కలిసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యలను మరింత వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో లొంగిపోయిన మాజీ సీపీఐ మావోయిస్టు సభ్యులకు ఇళ్ల స్థలాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఆదిలాబాద్ పట్టణంలోని పిట్టలవాడలో పంపిణీ చేశారు. బోథ్ దళానికి చెందిన కొమరం సుశీల @ రూపక్క, కుంటాల/బోథ్ దళాలకు చెందిన కుమరం సక్కుబాయి @ వసంతక్కలకు ఈ లబ్ధి కల్పించారు. గతంలో లొంగిపోయిన వీరికి ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అందించగా, ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా స్థిర జీవితం వైపు అడుగులు వేయించే ప్రయత్నం చేస్తోంది. సమాజంలో తిరిగి స్థిరపడేందుకు అవసరమైన సహాయం అందిస్తూ ప్రభుత్వం వారికి కొత్త జీవన మార్గాన్ని చూపిస్తోంది.
పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండ..
అదేవిధంగా ఆలంపల్లి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటోంది. 1987లో కడెం మండలం ఆలంపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పలువురు పోలీసులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో మృతి చెందిన పీసీ జె.ముకుందరావు భార్య విమలకు మావల మండలం దుబ్బగూడా గ్రామంలో ఇంటి స్థలం పట్టా పాస్‌బుక్‌ను అందజేశారు. పోలీసుల త్యాగాలను గుర్తిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించడం ప్రభుత్వ కర్తవ్యమని అధికారులు తెలిపారు. ఇక కారుణ్య నియామకాల కింద విధుల్లో ఉండగా.. మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక సాయం, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆర్. దిగంబర్ కుటుంబానికి ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు అందించగా, పి. శివాజీ కుమారుడు పృధ్వికి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. అలాగే హెచ్‌సీ రమణ రెడ్డి కుటుంబ సభ్యుడికి కూడా అదే విధంగా ఉద్యోగం కల్పించారు. ప్రభుత్వం ఒకవైపు లొంగిపోయిన మాజీ మావోయిస్టుల పునరావాసానికి, మరోవైపు విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాల సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు.
మాజీ నక్సలైట్లకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తాం..
హింస మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలో కలిసిన మాజీ నక్సలైట్ సభ్యులు సాధారణ జీవితం గడపడం సంతోషకరమని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. గృహ స్థలాలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం, విద్యా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అవసరమైన వైద్య సదుపాయాలను కూడా పూర్తిగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ నక్సలైట్ సభ్యులు ప్రభుత్వ సహకారంతో ప్రస్తుతం స్థిర జీవితం గడుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి అండ్ ఎల్ ఐజి గజరావ్ భూపాల్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీలు సురేందర్ రావు, మౌనిక, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఐపీఎస్ రాహుల్ కాంత్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






