దొంగ‌త‌నాలకు పాల్ప‌డిన న‌లుగురు వ్య‌క్తులు అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |

సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నే అత్యాశ‌తో తాళం వేసిన ఇళ్ల‌ను టార్గెట్ చేసి కాగజ్ నగర్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడిన నలుగురు యువకులను అరెస్టు చేసినట్టు ఎస్పీ నితిక పంత్ తెలిపారు.

దొంగ‌త‌నాలకు పాల్ప‌డిన న‌లుగురు వ్య‌క్తులు అరెస్ట్
X

దిశ, ఆసిఫాబాద్ : సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నే అత్యాశ‌తో తాళం వేసిన ఇళ్ల‌ను టార్గెట్ చేసి కాగజ్ నగర్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడిన నలుగురు యువకులను అరెస్టు చేసినట్టు ఎస్పీ నితిక పంత్ తెలిపారు. గురువారం కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. గత జనవరి 3న పట్టణానికి చెందిన ప్రసాద్ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. అదేరోజు రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులతో పాటు సుమారు రూ.2 లక్షల 75 వేల విలువైన వస్తువులు దొంగిలించినట్టు బాధితుడు జ‌న‌వ‌రి 5న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గురువారం పక్కా సమాచారంతో టౌన్ పోలీసులు కాగజ్ నగర్ పట్టణానికి చెంది ఇర్షాద్ పాషా అలియాస్ తాజ్ అదుపులోకి తీసుకొని విచారించగా.. షైక్ అంజద్, మిర్జా సోహైల్ బేగ్ లతో కలిసి దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఈ ముగ్గురు ఒక గ్యాంగ్ గా ఏర్పడి స‌ర్సిల్క్ కాలనీతో పాటు కాగజ్ న‌గ‌ర్ టౌన్ పరిసర ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని గత కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలినట్లు ఎస్పీ చెప్పారు. నిందితులు అపహరించిన బంగారం, వెండి ఆభరణాలను విక్రయించినట్టు వాటిని కోనుగోలు చేసిన పట్టణానికి చెందిన చిలుకూరి శ్రీకాంత్ ని సైతం అరెస్టు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు.

Next Story