వీడని యుద్ధ భయం..గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు విముఖత

by velandi.Saikiran |

నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలానికి చెందిన ఓ యువకుడు మూడు నెలల క్రితం గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ వెళ్లేందుకు వీసా దరఖాస్తు చేసుకున్నాడు.

వీడని యుద్ధ భయం..గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు విముఖత
X

వీడని యుద్ధ భయం!

గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు విముఖత

వీసా వచ్చినవారు సైతం వెనక్కి

మ్యాన్ పవర్ ఏజెన్సీల ఆందోళన

దిశ, ప్రతినిధి నిర్మల్: నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలానికి చెందిన ఓ యువకుడు మూడు నెలల క్రితం గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ వెళ్లేందుకు వీసా దరఖాస్తు చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఒక యాజమాన్యం ద్వారా ఒప్పందం కుదుర్చుకొని కువైట్‌లో లేబర్ పనికి వీసా సైతం పొందాడు. వీసా వచ్చిన తర్వాత గల్ఫ్ దేశానికి వెళ్లేందుకు సమాయుత్తం అవుతున్న సమయంలో సడన్‌గా అమెరికాతో కలిసి ఇజ్రాయిల్-ఇరాన్ నడుమ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధ ప్రభావం కారణంగా ఇరాన్ దేశం గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు సిద్ధమైనవారంతా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. ఇది లక్ష్మణ చందా మండల యువకుడి వ్యవహారం మాత్రమే కాదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో.. అందులోనూ నిర్మల్ జిల్లా నుంచి పెద్ద మొత్తంలో గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. గత రెండు మూడు నెలల నుండి అనేకమంది గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వీసా దరఖాస్తులు చేసుకొని ఉన్నారు.

ఆర్థికంగా తీవ్ర నష్టం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న దుబాయ్, కువైట్, అబుదాబి, షార్జా, ఒమన్, ఖతార్, సౌదీ తదితర దేశాల్లో ఒక నిర్మల్ జిల్లా నుంచి పదివేలకు పైగా ఉపాధి కోసం వలస వెళ్లి అక్కడ జీవనోపాధి పొందుతున్నారు. ముఖ్యంగా లక్ష్మణ చందా, మామడ, సోన్, నిర్మల్ రూరల్ సారంగాపూర్, దిలావర్పూర్, లోకేశ్వరం మండలాల నుంచి భారీ మొత్తంలో గల్ఫ్ వెళ్లారు. అక్కడ వారు పొందుతున్న ఉపాధిని చూసి ఈ ప్రాంత నిరుద్యోగ యువత తాము సైతం గల్ఫ్ వెళితే ఉపాధి పొందవచ్చన్న ఆశతో వివిధ కంపెనీల ద్వారా వీసా కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అనేకమందికి వీసాలు కూడా వచ్చాయి. ఇందులో ఎక్కువగా అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులే ఉన్నారు. హోటళ్లు, కర్మాగారాలు సహా అరబ్ షేక్‌ల నివాసాల్లో వివిధ రకాల పనులు చేసేందుకు, ఎడారి ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేందుకు వీసాలు ఎక్కువగా వస్తుంటాయి. గడిచిన రెండు మూడు నెలల వ్యవధిలోనూ నిర్మల్ ప్రాంతంలో సుమారు 300కు పైగా ఇలాంటి వీసాలు వచ్చాయని ఎక్కువగా గల్ఫ్ దేశాలకు లేబర్ ను పంపే ఒక మ్యాన్ పవర్ ఏజెన్సీ యజమాని వెల్లడించారు.

యుద్ధం కారణంగా సగానికి పైగా వీసాలు క్యాన్సిల్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. యుద్ధం ప్రభావం అసలు ఉందా లేదా అన్న విషయం పక్కనపెడితే... మీడియాలో పెద్ద మొత్తంలో జరుగుతున్న ప్రచారానికి తోడు, గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వారు అక్కడి నుంచి యుద్ధ సమాచారంపై ఇక్కడివారికి ఫోన్లు చేసి చెబుతుండడంతో గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ గల్ఫ్ వెళ్లాలంటేనే వణుకు పుడుతున్నదని చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అనేకమంది యుద్ధం కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. వీసా మంజూరు అయినప్పటికీ గల్ఫ్ వెళ్లేందుకు భయపడి వచ్చిన వీసాను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. గల్ఫ్ దేశాలకు లేబర్ పనిమీద వెళ్లేందుకు వీసా కోసం కనీసం 30 నుంచి 60 వేల దాకా ఖర్చు అవుతుందని చెబుతున్నారు. టికెట్ ఖర్చులు అదనంగా ఉంటాయి. యుద్ధం కన్నా ముందు దరఖాస్తు చేసుకున్న అనేకమంది తాజాగా గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వెనకడుగు వేసి ఆర్థికంగా నష్టపోయారని చెబుతున్నారు.

ఏజెన్సీలకూ నష్టమే

ఎక్కువగా లేబర్‌ను గల్ఫ్ దేశాలకు పంపే ఏజెన్సీలు కరీంనగర్ నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ మొత్తంలో ఉన్నాయి. లైసెన్స్ ఉన్న మ్యాన్ పవర్ ఏజెన్సీలు తక్కువగానే ఉన్నప్పటికీ, లైసెన్స్ లేకుండా నడిపే ఏజెన్సీలు ఎక్కువ మొత్తంలోనే ఉన్నాయని చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉండే అక్కడి ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడి నుండి స్థానిక ఏజెన్సీలు లేబర్‌ను గల్ఫ్ దేశాలకు పంపుతున్నాయి. ఇదే క్రమంలో రెండు మూడు నెలల క్రితం అలాగే పెద్ద మొత్తంలో లేబర్‌ను గల్ఫ్ దేశాలకు పంపేందుకు అక్కడి ఏజెన్సీలతో స్థానిక ఏజెన్సీలు ఒప్పందం కుదురుచుకున్నట్లు సమాచారం. అయితే, యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు వెనుకడుగు వేయడంతో స్థానికంగా ఉన్న ఏజెన్సీలు ఆర్థికంగా నష్టపోయినట్లు చెబుతున్నారు. లేబర్ రాకపోయినా అక్కడి ఏజెన్సీలు డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవని, ఒకవేళ బకాయి ఉన్నా తమ నుండి ముక్కు పిండి వసూలు చేస్తారని స్థానిక ఏజెన్సీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story