రైతు బలి.. డీలర్ల జల్సా!

by Jakkula.Mamatha |

ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి రోజురోజుకు మరింత ఆందోళనకరంగా మారుతోంది.

రైతు బలి..  డీలర్ల జల్సా!
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి రోజురోజుకు మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఒకవైపు పెరుగుతున్న పెట్టుబడులతో రైతు ఆర్థికంగా కుంగిపోతుండగా, మరోవైపు విత్తనాలు, పురుగు మందుల కంపెనీలు మరియు డీలర్లు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రధానంగా పత్తి,సోయాబీన్, మొక్కజొన్న పంటలు పండిస్తారు. కాగా అవి ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా రైతులకు “పంట క్షేత్ర ప్రదర్శనలు”, “అవగాహన కార్యక్రమాలు” పేరిట సమావేశాలు నిర్వహిస్తూ, కొత్త ఉత్పత్తులను కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. కానీ అసలు లక్ష్యం మాత్రం తమ టార్గెట్లు పూర్తి చేయడమేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ ప్రదర్శనలో చెప్పిన విధంగా ఫలితాలు రాకపోవడంతో రైతులు నష్టపోతుండగా, కంపెనీలు,డీలర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది.

పెరుగుతున్న ఖర్చులు..

ప్రతి ఎకరానికి సాగు ఖర్చు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిపోయింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మాత్రమే కాకుండా కూలీల ఖర్చులు, నీటి వనరుల ఏర్పాటు అన్ని కలిపి రైతుకు భారీ భారంగా మారాయి. ఈ ఖర్చులను భరించడానికి చాలా మంది రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. అయితే పెట్టుబడులకు తగిన విధంగా దిగుబడి రావడం లేదు. ఎండలు తీవ్రంగా ఉండటం, సమయానికి వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు సరిగా పెరగడం లేదు. కొన్ని చోట్ల పూర్తిగా పంటలు ఎండిపోతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. మరో వైపు మార్కెట్‌లో లభిస్తున్న విత్తనాలు, పురుగుమందుల నాణ్యతపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు వేసిన తర్వాత సరైన మొలకలు రావడం లేదని,పంట ఎదుగుదల సరిగా లేదని చెబుతున్నారు. పురుగుమందులు పిచికారీ చేసినా ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో మళ్లీ మళ్లీ మందులు వేయాల్సి వస్తుంది. దీంతో ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని రైతుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లభించని గిట్టుబాటు..

పంటలు సరిగా రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు.బ్యాంకులు సరైన సమయంలో రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ దళారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. పంట విఫలమైతే ఆ అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులు ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతున్నారు.కుటుంబ పోషణ కూడా భారంగా మారుతుంది. అదేవిధంగా పంట పండిన తర్వాత కూడా రైతుకు సమస్యలు తీరడం లేదు.మార్కెట్‌లో పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదు.మధ్యవర్తుల ఆధిపత్యం కారణంగా రైతు తన పంటను తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. కనీస మద్దతు ధర ఉన్నా, అది రైతుకు చేరే పరిస్థితి లేకపోవడం వల్ల నష్టాలు మరింత పెరుగుతున్నాయి. పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో రైతు అప్పుల చక్రంలో చిక్కుకుపోతున్నాడు.

డీలర్లు, కంపెనీలు లాభాల్లో..

జిల్లాలో రైతులు నష్టాల్లో ఉన్నప్పటికీ విత్తనాలు, పురుగు మందుల డీలర్లు మాత్రం లాభాల్లో ఉన్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కంపెనీలు డీలర్లకు లక్ష్యాలు నిర్దేశించి, వాటిని పూర్తి చేసిన వారికి టూర్లు, బహుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు సమాచారం. విదేశీ టూర్లు, విలాసవంతమైన గిఫ్టులు కూడా ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కొందరు డీలర్లు అధిక ధరలకు ఉత్పత్తులు విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రైతు పెట్టుబడి పెరిగిన కొద్దీ కంపెనీల లాభాలు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చిన్న వ్యాపారులపై ఒత్తిళ్లు..

మరోవైపు జిల్లావు పెద్ద విత్తనాలు, పురుగుమందుల డీలర్లు చిన్న వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంపెనీలు నిర్దేశించిన టార్గెట్లు పూర్తి చేయాలనే ఉద్దేశంతో పెద్ద డీలర్లు చిన్న షాపులపై ఒకే కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.ఇతర కంపెనీల ఉత్పత్తులు విక్రయిస్తే సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. దీంతో చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు నచ్చిన నాణ్యమైన ఉత్పత్తులు కాకుండా,డీలర్లు సూచించిన వస్తువులనే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. ఈ ప్రభావం చివరకు రైతులపై పడుతూ, వారికి సరైన ఎంపిక అవకాశాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

రైతు విత్తన చట్టం అమలు చేయాలి: సంగెపు బొర్రన్న రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు

రైతు విత్తన చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యాపారస్తులు,వడ్డీ వ్యాపారస్తులు రైతులను దోచుకుంటున్నారు. నాణ్యతలేని విత్తనాలు, అధిక వడ్డీ రుణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులను మోసం,నష్టం చేసే కంపెనీలు డీలర్లపై పీడీ యాక్ట్ అమలు చేయాలి. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి.

Next Story