- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ జిల్లాలో రబీకి రైతులు సిద్ధం
రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్‌లో భారీవర్షాలతో పత్తి, సోయా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక ఆర్థికంగా నష్టపోగా రబీ సాగు పైనే ఆశలు పెట్టుకున్నారు.

దిశ, ఆదిలాబాద్: రబీ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. వానాకాలం సీజన్‌లో భారీవర్షాలతో పత్తి, సోయా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక ఆర్థికంగా నష్టపోగా రబీ సాగు పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 1.8లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు పండించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జొన్న లక్ష ఎకరాల్లో, శనగ 40 వేల ఎకరాల్లో, మొక్కజొన్న 35 వేల ఎకరాల్లో, మిగతా వేరుశనగ, పెసర, మినుములు సాగు చేయనున్నారు. రబీ రైతులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు మరోవైపు జిల్లా వ్యవసాయ శాఖ సర్వం సిద్ధం చేసింది.వారికి అవసరమైన విత్తనాలతో పాటు ఎరువులు తదితర వాటిని సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా మరోవైపు జొన్న పంట సాగుపై వదంతులు రావడంతో పలువురు రైతుల్లో అయోమయం నెలకొంది.
రబీపైనే రైతన్న ఆశలు..
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.8 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు.కాగా రబీ కాలానికి సంబంధించి జిల్లాకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.ఇందులో 5500 క్వింటాళ్ల జొన్న,1250 క్వింటాళ్ల మొక్కజొన్న,9500 క్వింటాళ్ల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.గత రెండేళ్ల నుంచి జిల్లా వ్యాప్తంగా జొన్న,మొక్కజొన్న పంటల సాగు గణనీయంగా పెరుగుతోంది.
కాగా రబీ సాగును కొంతమంది రైతులు ఇప్పటికే ప్రారంభించారని అధికారులు సూచిస్తున్నారు.ప్రతీ ఏటా సోయా,మొక్కజొన్న సాగు చేసిన రైతులు మాత్రమే రబీ సాగు చేసే వారు.కానీ ఈ ఏడాది పత్తి రైతులు సైతం రెండుసార్లు పత్తి ఏరివేత పూర్తవగానే పత్తిని తొలగించి రబీ సాగుకు సిద్ధమవుతున్నారు.వానాకాలంలో పత్తికి ఆశించిన దిగుబడులు రాక నష్టపోయారు.పత్తిని తొలగించి రబీ సాగును ప్రారంభించారు.
జొన్న సాగు పై అయోమయం..?
జిల్లాలో జొన్న పంట సాగుపై కొంతమంది రైతుల్లో అయోమయం నెలకొంది.జొన్న పంట ప్రభుత్వం కొనదని.. వేయొద్దని..కొంతమంది డీలర్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.దీని వల్ల శనగ విత్తనాలు ఎక్కువ విక్రయాలు జరగాలనే ఉద్దేశంతోనే ..ఈ విధమైన ప్రచారానికి తెరలేపినట్లు తెలుస్తోంది.ఈ విధంగా అపోహలు రావడంతో రైతులు జొన్న పంట సాగు చేయాలా..? వద్దా..? అనే అయోమయంలో ఉన్నారు.దీనిపై వ్యవసాయ అధికారులను వివరణ అడగగా..మాకు దీనిపై ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేస్తున్నారు.దీంతో రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.ప్రభుత్వం,అధికారుల నుంచి ఏదైనా స్పష్టత వస్తేనే రైతులకు నష్టం జరగకుండా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జొన్న సాగు పై స్పష్టత ఇవ్వాలి..
ఈ ఏడాది పత్తి పంట ఆశించిన దిగుబడి రాక రైతులు అసలే ఇబ్బందుల్లో ఉన్నారు.కాగా రబీలో జొన్న పంటతోనైనా బాగుపడదాం అనుకుంటే..కొంతమంది రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారు.ప్రతి సంవత్సరం ప్రభుత్వం జొన్న పంట కొంటుంది.కొత్తగా ఇటువంటి వదంతులు రావడంతో అయోమయంలో ఉన్నాం. ప్రభుత్వం,అధికారులు దీనిపై స్పష్టత ఇచ్చి..ఇలాంటి వదంతులను సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.:-ఆశన్న, రైతు, వాన్వాట్ గ్రామం, ఆదిలాబాద్






