ఆదిలాబాద్‌లో సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు..

by Kodari Anjali |

ఈ నెల 6న పిప్పిరిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు గానూ అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి జూపల్లి అధికారులకు సూచించారు.

ఆదిలాబాద్‌లో సీఎం సభకు ముమ్మర ఏర్పాట్లు..
X

దిశ, బజార్ హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఈనెల 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు అనిల్ జాదవ్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావ్ మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈనెల 6న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు.

రూ.600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

బోథ్ నియోజకవర్గంలో సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. ఈ విద్యాసంస్థలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అలాగే బాసర సరస్వతి దేవాలయ అభివృద్ధికి రూ.300 కోట్లు, 2027 గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లతో కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా రూ.600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నాయని తెలిపారు. సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అయన కోరారు.

పిప్పిరి సభను విజయవంతం చేయాలి: మంత్రి వివేక్

ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎక్కడా లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు, పార్టీ శ్రేణులకు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఈ సభ మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, తాగునీరు వంటి సౌకర్యాలను సమకూర్చాలని ఆదేశించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధిపై సీఎం దృష్టి: ప్రభుత్వ సలహాదారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. సాగునీటి, విద్యా రంగాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ సుమారు రూ.600 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. పిప్రి సభలో కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మంజూరు అయితే ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని కోరారు.

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈనెల 6న మధ్యాహ్నం 2:00 గంటలకు హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చేరుకుని, అనంతరం సభా ప్రాంగణంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరిస్తారని తెలిపారు. సభలో ప్రసంగంతో పాటు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ చెక్కులు, సీఎం కప్ అవార్డుల ప్రదానం, గ్రామ పంచాయతీలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్లు అందజేయనున్నట్లు వివరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సభలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అంతకు ముందు సభ స్థలానికి చేరుకున్న మంత్రులకు, రాష్ట్ర సలహాసభ్యునికి హెలి ఫ్యాడ్ వద్దకు వెళ్లి పుష్పగుచ్ఛంతో అధికారులు, నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటిడిఏ పీవో యువరాజ్ మర్మాట్, కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ చైర్మన్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్, బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మున్సిపల్ చైర్మన్ బండారి అనిషా, మాజీ ఎంపీ సోయం బాపూరావ్, తులా అరుణ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story