- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంపెనీల పేరుతో పేదల భూములు దోపిడీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, కాగజ్ నగర్ : స్థానిక ప్రజల కోసం కంపెనీలు పెడుతున్నామని, భూమి ఇచ్చిన వారికి ఉద్యోగం కూడా ఇస్తామని నమ్మించి, పేదల భూములను గుంజుకొని మోసం చేశారని

దిశ, కాగజ్ నగర్ : స్థానిక ప్రజల కోసం కంపెనీలు పెడుతున్నామని, భూమి ఇచ్చిన వారికి ఉద్యోగం కూడా ఇస్తామని నమ్మించి, పేదల భూములను గుంజుకొని మోసం చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. భూములను బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి, కంపెనీ ఏర్పాటు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గురువారం ఆయన కాగజ్ నగర్ మండలంలోని జగన్నాథపూర్ గ్రామంలో పర్యటించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్నాథపూర్ ప్రాజెక్టును గత పాలకులు ఇసుక దందా చేయడానికే వాడుకున్నారని డా. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. "ఇప్పటివరకు పాలకులు ఎందరు మారినా జగన్నాథపూర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేదు?" అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టు కట్టకుండా, కాలువలు తవ్వి వదిలేశారని, పల్లెల్లోని ప్రజలు కాగజ్ నగర్ వెళ్లడానికి కనీసం బ్రిడ్జి కూడా నిర్మించలేకపోయారని విమర్శించారు.
సిర్పూర్ ప్రజలే నా కుటుంబం
సిర్పూర్ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులని డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఆస్తులను కుటుంబ సభ్యులకు పంచడం, కాంట్రాక్టులను బంధువులకు ఇవ్వడం వంటి పనులు తాను చేయనని తెలిపారు. నేను ఇతర ప్రాంతాల నుండి బంధువుల కుటుంబాలను ఇక్కడికి తీసుకొచ్చి దోపిడీ చేయను. ఇక్కడి ప్రజల అభివృద్దే నాకు ముఖ్యం, అని ఆయన నొక్కి చెప్పారు. వందేళ్లుగా అభివృద్ధికి నోచుకోని గ్రామాలు బోరిగాం, జవాజిగూడ ప్రజలు కాగజ్ నగర్ రావడానికి రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్ల నుండి ఈ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. జవాజిగూడ గ్రామానికి చెందిన మహిళలు అంగన్ వాడీ సబ్ సెంటర్ కావాలని, పాఠశాలలో ఇద్దరి బదులు ఒకరే టీచర్ ఉన్నారని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
విద్యార్థులకు ప్రోత్సాహం
అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మాట్లాడిన డా. ప్రవీణ్ కుమార్, వారితో బోర్డుపై లెక్కలు చేయించి బహుమతి ఇచ్చి ప్రోత్సహించారు. ఇంకా బాగా చదువుకోవాలని వారికి సూచించారు. రాబోయే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, మండల కన్వీనర్ పర్వతి అంజన్న, మహేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.






