ఎల్-నీనో ప్రభావం.. వ్యవసాయానికి గండం

by Taduka Kalyani |

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్న ఆందోళనలో మునిగిపోయాడు.

ఎల్-నీనో ప్రభావం.. వ్యవసాయానికి గండం
X

దిశ,బజార్‌హత్నూర్, జూన్ 18: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్న ఆందోళనలో మునిగిపోయాడు. ఎల్-నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు ఆలస్యమవుతుండగా, జూన్ 18 వచ్చినా అనేక ప్రాంతాల్లో సరిపడా వర్షపాతం నమోదు కాలేదు. దీంతో సాగుకు సిద్ధమైన రైతులు తీవ్ర అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొన్ని రోజుల క్రితం అడపాదడపా కురిసిన వర్షాలను నమ్ముకుని పలువురు రైతులు పత్తి, సోయాబీన్, కంది తదితర పంటల విత్తనాలను పొలాల్లో విత్తారు. అయితే అనంతరం మళ్లీ ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో విత్తిన విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తకపోవడం రైతులను కలవరపెడుతోంది. కొన్ని చోట్ల మొలకలు వచ్చినా ఎండల ధాటికి వాడిపోతుండగా, మరికొన్ని పొలాల్లో విత్తనాలు నేలలోనే ఉండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తిరిగి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు వ్యవసాయ పెట్టుబడులు రోజు రోజుకు పెరుగుతుండటం రైతులకు శాపంగా మారింది. విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతుండగా, ముఖ్యంగా డీఏపీ, పొటాష్ వంటి ఎరువుల ధరల పెరుగుదల రైతులపై అదనపు భారాన్ని మోపుతోంది. అప్పులు చేసి సాగుకు సిద్ధమైన రైతులు వర్షాలు లేకపోవడంతో పెట్టుబడులు కూడా ప్రమాదంలో పడిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.

కౌలు రైతుల కుదేలు

కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. భారీ మొత్తాలకు భూములు కౌలుకు తీసుకుని సాగు చేసేందుకు సిద్ధమైన రైతులు ఇప్పుడు వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కౌలు చెల్లింపులు, అప్పుల వడ్డీలు, కుటుంబ పోషణ ఖర్చులు ఒకవైపు, పంట సాగుపై అనిశ్చితి మరోవైపు వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. వ్యవసాయ పనులపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు కూడా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురవక సాగు పనులు ప్రారంభం కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పటికే గిట్టుబాటు ధరల లేమితో సతమతమవుతున్న రైతాంగం, ఇప్పుడు వర్షాభావం, ఎరువుల ధరల పెరుగుదల, విత్తనాల మొలక సమస్యలతో మరింత కుంగిపోతోంది. రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి ఎరువుల ధరలను నియంత్రించడంతో పాటు, అవసరమైతే పునర్విత్తనాల కోసం ప్రత్యేక సహాయం అందించాలని కోరుతున్నారు. "అడపాదడపా వానలను నమ్మి విత్తిన విత్తనాలు... ఎండల దెబ్బకు మొలకలు లేక రైతన్న ఆవేదన" అనే పరిస్థితి ప్రస్తుతం రైతాంగాన్ని వెంటాడుతోంది. ప్రకృతి కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతన్న కష్టాలు గట్టెక్కాలని గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

Next Story