సీఎం సార్ భైంసా బడి చూసేనా..!

by Batti.Sumithra |

2025 సంవత్సరంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు.

సీఎం సార్ భైంసా బడి చూసేనా..!
X

దిశ, భైంసా : 2025 సంవత్సరంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులను అభినందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రస్తుత నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కిసాన్ గల్లి బాలికల ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్, అక్కడి ఉపాధ్యాయుల సేవా గుణాన్ని ‘దిశ’ పత్రిక మొదట ప్రచురించగా, వారి సేవా భావాన్ని సభా వేదికగా సీఎం ప్రశంసించారు. అక్కడి హెడ్మాస్టర్ తన భార్య జ్ఞాపకార్థం లక్షల రూపాయల సొంత నిధులను బడి అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించిన తీరు ప్రశంసనీయమన్నారు.

అదేవిధంగా విద్యార్థులకు ఆటో సదుపాయం కల్పించి, ఆ ఆటో చార్జీలను సైతం ఉపాధ్యాయులే తమ జీతం నుండి తలా కొంత చందా వేసుకొని భరించడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉపాధ్యాయులు సామాజిక బాధ్యతతో ఉండాలని, పేద విద్యార్థుల పట్ల చూపుతున్న దయాగుణం అభినందనీయమని తెలిపారు. వీలైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆ పాఠశాలను సందర్శిస్తానని సభ వేదికగా హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈనెల 6వ తేదీన బాసర ఆలయ అభివృద్ధి పనులకు, ముధోల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరయ్యే సీఎం రేవంత్ రెడ్డి, బాసర నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైంసా బడిని కూడా సందర్శించడానికి ఇది మంచి అవకాశం కానుంది. గతంలో పాఠశాలకు వస్తానని ప్రకటించిన సీఎం, ఈ నేపథ్యంలో భైంసా బాలికల పాఠశాలను సందర్శిస్తారా..? అనే ఆసక్తి నెలకొంది. “భైంసా బడి ఎదురుచూస్తోంది” అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.

Next Story