పెళ్లిళ్లలో వరకట్నాలు బంద్..

by Kodari Anjali |

పెళ్లిళ్ల కట్న, కానుకల విషయంలో ఆదివాసీలు తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లిళ్లలో వరకట్నాలు బంద్..
X

దిశ, ఉట్నూర్: ఏజెన్సీలోని ఆదివాసీ సమాజం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. నేటి సమాజంలో పేద కుటుంబాలకు పెళ్లిళ్లు పెను భారంగా మారుతున్నాయి. ఉన్న ఆస్తులను అమ్ముకొని, అప్పులు చేసి కట్న, కానుకలు అందించి పెళ్లిళ్లు చేసి ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఆదివాసీలు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదివాసీ గూడాల్లో జరిగే పెళ్లిళ్లలో ఇక కట్న, కానుకలు తీసుకోవద్దని నిషేధం విధించారు. ఈ నిర్ణయంతో ఆదివాసీ సమాజం తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శనీయమని పలువులు అభినందిస్తున్నారు. అయితే ఉట్నూర్ మండలంలోని గొండుగూడ జీ పంచాయతీలో ఆత్రం భీంబాయి, దశ్వంత్ రావ్ దంపతులకు ఇద్దరు కుతుళ్లు ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం. కూలీ చేసుకోని జీవనం సాగిస్తున్న కుటుంబం. ఈ దంపతులకు మొదటి కుమార్తె ఆత్రం రంభబాయికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇక నుండి గ్రామంలో కట్న, కానుకులు నిషేధిస్తూ తీర్మాణించడమే కాకుండా ఆ నిరుపేద కుటుంబానికి గ్రామస్తులందరూ ఏకమై ప్రతి ఇంటింటికి రూ. 200 చొప్పున జమ చేసి 21వేల రుపాయలు గ్రామ పటేల్, గ్రామ సర్పంచ్ సమక్షంలో కుటుంబ సభ్యులకు అందించారు.

వరకట్నాలు తీసుకోమని ఏకగ్రీవ తీర్మాణం..

నార్నూర్ మండలంలోని బలన్‌పూర్ గ్రామంలో వరకట్నరహిత దిశగా అడిగులేసింది. గత సోమవారం గ్రామస్తులందరూ కలిసి ఇకపై ఆదివాసి పెళ్లిళ్లలో వరకట్నాలు తీసుకోమని ఏకగ్రీవ తీర్మాణం చేశారు. గ్రామానికి చెందిన కోవ కామేశ్వరి వివాహానికి గ్రామస్తులు స్వచ్ఛందంగా 25.101 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఇలా అనేక ఆదివాసీ గ్రామాల్లో నూతన ఓరవడికి శ్రీకారం చుట్టారు. ఇక అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న అడవి బిడ్డల ఆచార వ్యవహారాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఎంతో నియమనిష్టతో నిర్వహించుకునే ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు తోడుగా ఆదివాసులు నూతన ఆచారానికి తెరలేపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఇక నుండి ఆడవి బిడ్డల పెళ్లిళ్లలో కట్న, కానుకలు లేకుండా పెళ్లి జరిపించాలని గొప్ప ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా అనేక ఆదివాసీ గ్రామాల్లో కట్న,కానుకలు లేకుండా పెళ్లిళ్లి జరిగినట్లు ఆదివాసీ పెద్దలు తెలిపారు. అదే విధంగా ఇప్పటి నుండి కట్న, కానుకలు నిషేధంపై అనేక ఆదివాసీ గూడాలలో తీర్మాణాలు చేశారు.

ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని..

పెళ్లి చేయాలంటే ఎన్ని లక్షలిస్తారు, బంగారం ఎన్ని తులాలు పెడతారు, ఏమైన కారు, బండి కొనిస్తారా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం వస్తాయి. ఉన్న డబ్బులు సరిపోకుంటే అప్పులు తీసుకవచ్చి పెళ్లి ఎలాంటి అటంకాలు జరగకుండా ఎంతో అర్భాటంగా ఘనంగా నిర్వహిస్తారు. ఒకే పెళ్లికి ఇవన్ని చేయాలంటే లక్షలు కావాల్సిందే. పేదలు, సామాన్య కుటుంబాలకు పెళ్లి అంటే పెద్ద పరీక్షగా మారుతుంది. ఇలాంటి ఇబ్బందులును దృష్టిలో పెట్టుకొని ఆదివాసీ సమాజం పెళ్లికి కట్నకానుకలు నిషేదంపై తీర్మాణాలు చేయడమనేది అందరికి ఆదర్శ నిర్ణయంగా చర్చిస్తున్నారు.

నిరుపేద కుటుంబాలకు విరాళాలు సేకరణ..

ఆదివాసీ గూడాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఆదుకునేందుకు ప్రతి ఇంటింటికి నుండి విరాళాలను సేకరిస్తున్నారు. ఉట్నూర్ మండలంలోని గోండుగూడ, ఘన్పూర్, కన్నాపూర్, మారుగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, సిరికొండ, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి ఇతర మండలాల్లోని ఆదివాసీ గూడాలలో ప్రతి ఇంటింటి నుండి కనీసంగా 200 రుపాయలను విరాళాలుగా సేకరించి గ్రామ పటేల్ ఆధ్వర్యంలో పెళ్లికి అండగా నిలుస్తున్నారు.

భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఆదివాసీ పెద్దలు

ఆదివాసీ గ్రామాల్లో జరిగే పెళ్లిళ్ళు ఇక కట్న, కానుకులను నిషేధిస్తూ తీర్మాణాలు చేశామని ఆదివాసీ పెద్దలు పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయంతో భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలువనున్నది. కట్న, కానుకల నిషేధ నిర్ణయంతో ఐక్యతను సైతం కాపాడుతుందన్నారు. ఈ నిర్ణయంతో పేద, సామాన్య కుటుంబంపై ఆర్థిక భారం సమస్య తగ్గుతుందని పేర్కొన్నారు.

Next Story