పెళ్లిళ్లలో వరకట్నాలు బంద్.. నూతన ఒరవడికి శ్రీకారం

by Batti.Sumithra |

ఏజెన్సీలోని ఆదివాసీ సమాజం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

పెళ్లిళ్లలో వరకట్నాలు బంద్.. నూతన ఒరవడికి శ్రీకారం
X

దిశ, ఉట్నూర్ : ఏజెన్సీలోని ఆదివాసీ సమాజం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. నేటి సమాజంలో పేద కుటుంబాలకు పెళ్లిళ్లు పెను భారంగా మారుతున్నాయి. ఉన్న ఆస్తులను అమ్ముకుని, అప్పులు చేసి కట్నం, కానుకలు అందించి పెళ్లిళ్లు చేసి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆదివాసీలు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదివాసీ గూడాల్లో జరిగే పెళ్లిళ్లలో కట్నం, కానుకలు తీసుకోవద్దని నిషేధం విధించారు. ఈ నిర్ణయాన్ని ఆదివాసీ సమాజం తీసుకోవడం ఆదర్శనీయమని పలువురు అభినందిస్తున్నారు.

గోండుగూడలో..

ఉట్నూర్ మండలంలోని గోండుగూడ జీ పంచాయతీలో ఆత్రం భీంబాయి, దశ్వంత్ రావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు నిరుపేద కుటుంబానికి చెందినవారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతుల పెద్ద కుమార్తె ఆత్రం రంభాబాయికి పెళ్లి నిశ్చయమైంది. గ్రామంలో ఇకపై కట్నం, కానుకలు నిషేధిస్తూ తీర్మానం చేయడమే కాకుండా, ఆ నిరుపేద కుటుంబానికి గ్రామస్థులందరూ ఏకమై ప్రతి ఇంటి నుంచి రూ.200 చొప్పున సేకరించి మొత్తం రూ.21,000లను గ్రామ పటేల్, గ్రామ సర్పంచ్ సమక్షంలో కుటుంబ సభ్యులకు అందించారు.

బలన్పూర్‌లో వరకట్నాలకు నో..

నార్నూర్ మండలంలోని బలన్పూర్ గ్రామంలో వరకట్న రహిత దిశగా అడుగులు వేశారు. గత సోమవారం గ్రామస్థులందరూ కలిసి ఇకపై ఆదివాసీ పెళ్లిళ్లలో వరకట్నాలు తీసుకోబోమని ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామానికి చెందిన కోవ కామేశ్వరి వివాహానికి గ్రామస్థులు స్వచ్ఛందంగా రూ.25,101 ఆర్థిక సాయం అందజేశారు. ఇలా అనేక ఆదివాసీ గ్రామాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

అనేక ఆదివాసీ గూడాల్లో ఈ నిర్ణయం అమలులో..

అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీల ఆచార వ్యవహారాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఎంతో నియమనిష్ఠతో నిర్వహించుకునే ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు తోడుగా ఇప్పుడు నూతన ఆచారానికి తెరలేపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ఆదివాసీ గ్రామాల్లో ఇకపై పెళ్లిళ్లను కట్నం, కానుకలు లేకుండా నిర్వహించాలని ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో కట్నం లేకుండా పెళ్లిళ్లు జరిగినట్లు ఆదివాసీ పెద్దలు తెలిపారు. అలాగే ఇకపై కట్నం, కానుకల నిషేధం పై అనేక గూడాల్లో తీర్మానాలు చేశారు.

ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని…

పెళ్లి చేయాలంటే ఎన్ని లక్షలు ఇస్తారు, బంగారం ఎన్ని తులాలు పెడతారు, కారు లేదా బైక్ ఇస్తారా అనే ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఉన్న డబ్బులు సరిపోకపోతే అప్పులు తెచ్చి పెళ్లిని అర్భాటంగా నిర్వహిస్తున్నారు. ఒకే పెళ్లికి లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. పేద, సామాన్య కుటుంబాలకు పెళ్లి అంటే పెద్ద పరీక్షగా మారుతోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆదివాసీ సమాజం కట్నం, కానుకల నిషేధంపై తీర్మానాలు చేయడం అందరికీ ఆదర్శంగా మారింది.

నిరుపేద కుటుంబాలకు విరాళాల సేకరణ..

ఆదివాసీ గూడాల్లో నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి ఇంటి నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఉట్నూర్ మండలంలోని గోండుగూడ, ఘన్పూర్, కన్నాపూర్, మారుగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, సిరికొండ, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, తిర్యాణి తదితర మండలాల్లో ప్రతి ఇంటి నుంచి కనీసం రూ.200 చొప్పున విరాళాలు సేకరించి గ్రామ పటేల్ ఆధ్వర్యంలో పెళ్లికి అండగా నిలుస్తున్నారు.

భవిష్యత్ తరాలకు ఆదర్శంగా.. ఆదివాసీ పెద్దలు

ఆదివాసీ గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లలో ఇకపై కట్నం, కానుకలను నిషేధిస్తూ తీర్మానాలు చేశామని ఆదివాసీ పెద్దలు తెలిపారు. ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని, ఐక్యతను కూడా కాపాడుతుందని చెప్పారు. ఈ నిర్ణయంతో పేద, సామాన్య కుటుంబాల పై ఆర్థిక భారం తగ్గనుంది.

Next Story