చామనపల్లిలో పోడు భూముల లొల్లి

by Taduka Kalyani |

భూమిని నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులకు, అటవీ అధికారులకు మధ్య మొదలైన గొడవ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఓ రైతు పురుగుల మందు సేవించిన ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లిలో చోటుచేసుకుంది.

చామనపల్లిలో పోడు భూముల లొల్లి
X

దిశ, వేమనపల్లి : భూమిని నమ్ముకుని సాగు చేసుకుంటున్న రైతులకు, అటవీ అధికారులకు మధ్య మొదలైన గొడవ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఓ రైతు పురుగుల మందు సేవించిన ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం చామనపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే బుధవారం చామనపల్లిలోని రెవెన్యూ సర్వే నెంబర్ 67, అటవీ శాఖ రికార్డుల ప్రకారం చెన్నూరు ఆర్ఎఫ్ కంఫర్ట్ మెంట్ 125 లో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు ప్లాంటేషన్ పనులు చేస్తున్న సమయంలో.. చామనపల్లి కి చెందిన రైతులు అక్కడకి చేరుకొని ఈ భూమిని నమ్ముకుని సాగు చేసుకుంటున్నామని, గతంలో ప్రభుత్వం కూడా మాకు పట్టాలు పంపిణీ చేసిందని, గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూముల్లో సాగు చేసుకుంటున్నామని, మా భూముల్లో మొక్కలకు నాటేందుకు వీలు లేదని అటవీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో అటవీ అధికారులు రేపు మళ్లీ వస్తామని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. గురువారం ఉదయం చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ అధికారి సర్వేశ్వరరావు, నిల్వాయి అటవీ క్షేత్రాధికారి హాఫీజోద్ధీన్, చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ, నీల్వాయి ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి అటవీ అధికారులు చామనపల్లిలోని వివాదాస్పద భూమి వద్దకు చేరుకున్నారు. రైతులకు అటవీ అధికారులకు వాగ్వాదం జరుగుతున్న సమయంలో చామనపల్లి కి చెందిన నూకల తిరుపతి అనే రైతు పురుగుల మందు సేవించడంతో గ్రామస్తులు గమనించి అక్కడి నుంచి అతడిని బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధికారులు రైతులు మధ్య చర్చలు అనంతరం అటవీ అధికారులు, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ శాఖల మధ్య జాయింట్ సర్వే చేసి భూ సమస్యకు పరిష్కారం చూపెడతామని చెప్పడంతో రైతులు అధికారులు ఆ భూమి నుంచి వెళ్లిపోయారు.

Next Story