- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఏపీ అధిక ధరలకు విక్రయం..డీలర్ లైసెన్స్ సస్పెండ్...
రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎరువులను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు.

దిశ, భైంసా : రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఎరువులను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా హెచ్చరించారు. భైంసా పట్టణంలో డీఏపీ ఎరువులను నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయించిన ఘటనపై వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక ఆధారంగా సంబంధిత డీలర్ లైసెన్సును సస్పెండ్ చేసినట్లు ఆయన సోమవారం వెల్లడించారు. వానాకాలం సాగు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని,ఈ క్రమంలో కొందరు వ్యాపారులు డీఏపీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందటంతో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత డీలర్‌పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన మరో నలుగురు ఎరువుల డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి తాఖీదులు ఇచ్చినట్లు వెల్లడించారు. రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేయడం, ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించడం, నకిలీ విత్తనాల విక్రయం, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు జరపడం వంటి చర్యలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాలు, విత్తన విక్రయ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, ఎవరైనా అధిక ధరలకు విక్రయించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని పేర్కొన్న కలెక్టర్, ఎరువులు, విత్తనాల సరఫరాలో అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.






