- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ లో సంస్థాగత సందడి..ఆశావహులకు పార్టీ పదవులు
మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ లో సంస్థాగత సందడి మొదలైంది.

కాంగ్రెస్ లో సంస్థాగత సందడి
• ఆశావహులకు పార్టీ పదవులు
• 13లోగా మండల, పట్టణ కమిటీల అధ్యక్షుల ఎంపిక
• 26వ తేదీలోపు పూర్తిస్థాయి కార్యవర్గాల ప్రకటన
• ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డీసీసీల ముమ్మర కసరత్తు
• నేతల మధ్య విభేదాలతో కొన్నిచోట్ల నియామకాల్లో జాప్యం
దిశ ప్రతినిధి, నిర్మల్: టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత సందడి మొదలైంది. కీలకమైన కాంగ్రెస్ పార్టీ మండల శాఖల అధ్యక్షులు పట్టణ కమిటీ అధ్యక్షులు ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈనెల 13వ తేదీలోగా మండల పట్టణ కమిటీల అధ్యక్షులను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అనంతరం 26వ తేదీలోగా అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు ఇతర పార్టీ పదవులతో కూడిన పూర్తిస్థాయి కమిటీలను వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
13 లోగా మండల కమిటీలకు అధ్యక్షులు
టిపిసిసి ఆదేశం మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షులు రానున్నారు ఈ మేరకు ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల్లో ఆయా జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసరత్తు మొదలుపెట్టారు. టిపిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మార్క్ మండల స్థాయి ఎన్నికలపై కూడా కనిపిస్తున్నది గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జీలు శాసనసభ్యులు పార్లమెంట్ ఇన్చార్జిలు కూర్చుని మండల పార్టీ అధ్యక్షులను ఖరారు చేసే పరిస్థితి ఉండేది. అయితే తాజాగా పార్టీ మండల శాఖల అధ్యక్షులను ఖరారు చేసే విషయంలో ముందుగా ఆశావహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. డిసిసి అధ్యక్షులు మండలాల వారీగా పర్యటనలు జరిపి, లేదంటే నియోజకవర్గ కేంద్రంలో, బ్లాక్ స్థాయిలో ఆశావాహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఒకటి కన్నా ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్లయితే వాటిని పరిశీలించి జిల్లా కాంగ్రెస్ స్థాయిలో ఫైనల్ చేయనున్నారు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి వారికి మండల/ పట్టణ శాఖ అధ్యక్షులుగా అవకాశం ఇవ్వనున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో మిగతా జిల్లాల కన్నా ముందుగా అక్కడి డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జిల్లా వ్యాప్తంగా పర్యటించి మండల శాఖ అధ్యక్ష పదవులు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం పూర్తి చేశారు. మిగతా జిల్లాల్లోనూ ఇప్పటికే కొందరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను కలిసి దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఈనెల 13వ తేదీలోగా కమిటీలకు అధ్యక్షులను ఫైనల్ చేయనున్నారు. దీంతో ఆయా మండలాలకు కొత్తగా ఖరారు కానున్న అధ్యక్షులపై ఉత్కంఠ నెలకొంది.
26 లోగా పూర్తిస్థాయి కమిటీలు
మండల శాఖలకు అధ్యక్షులను ప్రకటించిన తర్వాత ఈనెల 26వ తేదీలోగా మిగతా పూర్తిస్థాయి కమిటీలను ఖరారు చేసినందుకు చర్యలు తీసుకుంటున్నారు. అధ్యక్ష పదవితో పాటు కీలకమైన ప్రధాన కార్యదర్శి కోశాధికారి సహా మండల కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి ఉపాధ్యక్షులు తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పదవులను సైతం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ ముఖ్య నేతలను సమన్వయం చేసుకొని ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
కమిటీల ఖరారులో వీరే కీలకం...
మండల పట్టణ శాఖ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపిక తో పాటు పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటులో డిసిసి అధ్యక్షులు అత్యంత కీలకంగా వ్యవహరించన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నచోట వారితో సమన్వయం చేసుకొని డిసిసి అధ్యక్షులు కమిటీల అధ్యక్షులను ఖరారు చేస్తారు. మంచిర్యాల ఖానాపూర్ చెన్నూరు బెల్లంపల్లి నియోజకవర్గం అక్కడి శాసనసభ్యులకు, నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్, బోథ్ నియోజకవర్గాల్లో అక్కడి నియోజకవర్గ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకొని డిసిసి అధ్యక్షులు 13వ తేదీలోగా మండల శాఖ అధ్యక్షులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మండల కమిటీలను ఖరారు చేయడంలో వీరు కీలకంగా వ్యవహరించరున్నారు. పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వారికి ముందుగా అవకాశం ఇస్తారని తెలుస్తున్నది. అయితే కొన్నిచోట్ల నియోజకవర్గాల ఇన్చార్జీలకు కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు సఖ్యత లేకపోగా తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో మండల కమిటీల ఖరారు డీసీసీలకు ఒక సవాలుగా మారనుంది.






