పాఠశాలలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

by Kodari Anjali |

విద్యా ప్రమాణాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

పాఠశాలలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
X

దిశ, బజార్‌హత్నూర్: మండలం దిగ్నూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు. పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం.. పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు. వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. భోజన నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న తాగునీటి సదుపాయాలను పరిశీలించిన కలెక్టర్, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

నీటి నిల్వ ట్యాంకులను నిరంతరం శుభ్రపరచాలని సూచించారు. పాఠశాల గదులు, మరుగుదొడ్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్యనందించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా పురోగతిపై ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్, మౌనిక, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నూర్ సింగ్, సూపరింటెండెంట్ ఇంజినీరింగ్ శ్రవణ్ కుమార్, ఈఈ చంద్రమోహన్, డీఈఈ రమణ, ఏఈఈ దివాకర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story