ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు సీఎం టూర్

by Jakkula.Mamatha |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర ప్రారంభించి సుమారు 1300కు పైగా కిలోమీటర్లు నిర్వహించిన ఆయన సాహసోపేత యాత్రకు సోమవారం నాటికి మూడేళ్లు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు సీఎం టూర్
X

దిశ ప్రతినిధి, నిర్మల్: నాటి సీఎల్పీ నేత.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తన వంతు కృషిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర ప్రారంభించి సుమారు 1300కు పైగా కిలోమీటర్లు నిర్వహించిన ఆయన సాహసోపేత యాత్రకు సోమవారం నాటికి మూడేళ్లు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవిని పొందడం ఒక ఎత్తు అయితే.. నాడు ఆయన ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నాటి ఆయన చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంఘీభావంగా ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామానికి వస్తుండడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్ పర్యటన కాంగ్రెస్ పార్టీలో నేతల నడుమ సంపూర్ణ అవగాహన ఉందన్న సంకేతాలు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ శ్రేణులకు జవసత్వాలు ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

పార్టీకి దన్ను.. అభివృద్ధికి బాటలు..

రేవంత్ రెడ్డి సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న కార్యక్రమం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు బలాన్ని ఇచ్చే కార్యక్రమంగా కనిపిస్తున్నది. నాడు సీఎల్పీ నేత హోదాలో మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు నిండిన సందర్భంగా పార్టీ శ్రేణులకు ఒక మంచి సంకేతాలను ఇచ్చే కార్యక్రమంగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీన్ని ఇతర రాజకీయ పక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన కార్యక్రమంగానే అభివర్ణిస్తున్నాయి. ప్రతిపక్ష నేత హోదాలో భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామం నుంచి పీపుల్స్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న అనేక సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు, అభ్యర్థనలు స్వీకరించారు. గత కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని ఈ సందర్భంగా ఆయన ఊరురా పర్యటించిన సందర్భంగా ప్రజల నుంచి వాస్తవాలను గ్రహించారు. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టోలో అనేక అంశాలు క్రోడీకరించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు పడుతున్న పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ఎన్నికల సమయంలో ప్రధాన హామీగా చేర్చారు. కుప్టి సాగునీరు, జలవిద్యుత్ బహుళార్ధ సాధక ప్రాజెక్టు విషయం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు, వందలాది ఆదిమ గిరిజన గ్రామాలకు తాగునీరు విద్యుత్ రవాణా సౌకర్యం వంటి అనేక అంశాలు సమస్యలు పీపుల్స్ మార్చ్ లో ఆయన దృష్టికి రాగా వాటి పరిష్కారం కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చింది. బాసర ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 225 కోట్లతో మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలిపిన ప్రభుత్వం వెనువెంటనే ఆర్థికపరమైన ఆమోదాన్ని ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో శంకుస్థాపనలు చేయనున్నారు.

మరోవైపు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో బాసర ట్రిపుల్ ఐటీ వచ్చిన సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన సమస్యల పై కూడా నేటి పర్యటనలు స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఒక మంచి అవకాశం గా విద్యార్థి వర్గాలు ఆశిస్తున్నాయి. మరోవైపు బాసరలో యూనివర్సిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చిన సీఎం మరోసారి ఇందుకు సంబంధించి పరిపాలన ఆమోదం కోసం నేటి బహిరంగ సభలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ విషయంపై కూడా ఈ సందర్భంగా హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులు వాటి కింద ప్రధాన కాలువల నిర్మాణాలకు మరమ్మత్తులకు కూడా నిధులు విడుదల చేసే విషయంపై సీఎం ప్రకటన చేస్తారని జిల్లా రైతులు ఆశిస్తున్నారు.

దేగాం ప్రాజెక్టు పునరావాస బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం పై కూడా ఈ సందర్భంగా సీఎం పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. బోథ్ నియోజకవర్గంలో ఉన్న అనేక పెండింగ్ సమస్యల పై స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య ఇతర స్థానిక నాయకులు సీఎం దృష్టికి తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. బోథ్ నియోజకవర్గానికి, అలాగే ఇచ్చోడ మండల కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి రహదారుల విస్తరణ పై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం దృష్టికి తీసుకువెళ్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా రైతులు పండించే పత్తి సోయా జొన్న తదితర పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు మార్కెట్ సౌకర్యం మరింత విస్తరించే విషయం పై కూడా సీఎం హామీ ఇస్తారని రైతులు ఆశిస్తున్నారు.

Next Story