రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

by Disha Web Desk 20 |
రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
X

దిశ, బెల్లంపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం బెల్లంపల్లి మండలం గురిజాల రైతువేదికలో తెలంగాణ రాష్ట్ర రైతు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. స్వతహాగా రైతు అయిన తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకాలంలో రైతుల కష్టాలను చూసిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల కోసం ఉచిత సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా, కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ లాంటి అనేక పథకాలను అమలుచేస్తున్నారని తెలిపారు.

ఈ పథకాల ద్వారా బెల్లంపల్లి నియోజకవర్గంలో వేలమంది రైతులు లబ్దిపొందారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా రైతులకోసం తెలంగాణ రాష్ట్ర రైతు దినోత్సవాన్ని ఏర్పాటు చేసి రైతుల గౌరవం పెంచిన ఘనత కేవలం సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమ పథకాల ఫలాలు రెట్టింపు కావాలంటే మనమందరం రైతుపక్షపాతి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ నే ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ సుభాష్ రావు, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్, సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి లక్ష్మణ్, ఆర్డీవో శ్యామలదేవి, ఏడీఏ సురేఖ, కేవీకే ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాజేశ్వర్ నాయక్, ఎంపీడీవో రాజేందర్, అధికారులు, మండల రైతులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story