- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంతోషాన్ని వెతుక్కుంటున్నాను.. మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్వహించిన "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్వహించిన "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నేరుగా ఫోన్ కాల్‌లో మంత్రి కొండా సురేఖ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాల్స్‌లో రెవెన్యూ, భూ సమస్యలు, తాగునీరు, రహదారులు, టాయిలెట్లు, డ్రైనేజీ, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు, ఇందిరమ్మ ఇండ్లు, శ్మశానవాటికల ఏర్పాటు, మౌలిక సదుపాయలు, పెన్షన్లు తదితర అంశాలపై ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని ఓపికగా విన్న మంత్రి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి, వారి సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు. పలు సమస్యల పై వెంటనే వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, జీడబ్ల్యుఎంసీ కమిషనర్ వెంకన్నతో పాటు పలువురు ఇతర అధికారులతో మాట్లాడి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కరానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రతి వ్యక్తికీ న్యాయం జరుగుతుంది..
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ “ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ప్రజలు నన్ను గుర్తిస్తారు. ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి వినతిని నా సమస్యగా భావించి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నాను. ప్రజా ప్రభుత్వంలో ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుంది” అని పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనూ తాను, తన భర్త, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరిస్తూ, సంబంధిత అధికారులతో అప్పటికప్పుడు మాట్లాడి సాధ్యమైనంత వేగంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, హైదరాబాద్ సచివాలయంలోని తన కార్యాలయంలోనూ, జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనూ, బంజారాహిల్సల్ లోని క్యాంపు కార్యాలయంలోనూ ప్రజలు, అవసరార్థులు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
“పదవులతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజాసేవలోనే తృప్తిని వెతుక్కుంటున్నాను. ప్రజల సమస్యలు పరిష్కారమై వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే నాకు నిజమైన సంతృప్తి. ప్రజలకు అందుబాటులో ఉండటం నా బాధ్యతగా, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను” అని మంత్రి సురేఖ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటుందని, ప్రజల సమస్యల పరిష్కారానికే తమ తొలి ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన, పారదర్శకమైన, ప్రజా కేంద్రిత పాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.






