Focus: ఆ జిల్లాకు సీఎం కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారి పర్యటన

by Disha Web Desk 16 |
Focus: ఆ జిల్లాకు సీఎం కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారి పర్యటన
X
  • కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవం
  • కేసీఆర్ పర్యటనపై భారీ ఆశలు...
  • జిల్లాకు రూ.500 కోట్ల ప్యాకేజీ ప్రకటించే అవకాశం..!
  • నిర్మల్ మున్సిపాలిటీకి రూ.100 కోట్ల కేటాయింపు..!
  • మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లకు చర్యలు

దిశ ప్రతినిధి నిర్మల్: సుదీర్ఘకాలం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లాకు వస్తున్నారు. జూన్ 4న ఆయన సీఎం పర్యటన ఖరారైంది. గత పార్లమెంటు ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ జిల్లాకు వస్తుండడం ఇదే తొలిసారి. నిర్మల్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా కేంద్రంలో భారత్ రాష్ట్ర సమితి శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రకటన వెలువడినప్పటికీ, బహిరంగ సభతో పాటు ఇతర కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంది. కాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లకు చర్యలు కొనసాగుతున్నాయి.

అనేక వివాదాల నడుమ కలెక్టరేట్ ప్రారంభోత్సవం

నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ఎట్టకేలకు జూన్ 4న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. అనేక వివాదాల సుడిగుండంలో పడి నిర్మాణ పనులకు ఆటంకాలు ఎదురయ్యాయి. చెరువు ఎఫ్ టీ ఎల్ భూముల్లో కలెక్టరేట్ కార్యాలయం నిర్మిస్తున్నారని అక్కడ కలెక్టరేట్ కార్యాలయం నిర్మించవద్దని బీజేపీ సహా పలు ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కొందరు హైకోర్టుకు సైతం వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణంలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో కార్యాలయ ప్రారంభోత్సవం కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తికాగా కొన్ని చిన్న చిన్న పనులు మాత్రం మిగిలి ఉన్నాయి.

పర్యటనపై భారీ ఆశలు

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనపై నిర్మల్ జిల్లా వాసులు భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనేక అభివృద్ధి పనులు సీఎం పర్యటన సందర్భంగా పరిష్కారానికి నోచుకుంటాయని భావిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కాలేశ్వరం ప్యాకేజీ 27, 28 కింద కొనసాగుతున్న హై లెవెల్ కెనాల్, సదర్ మాట్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి భారీగా నిధులు ప్రకటిస్తారని జిల్లా రైతాంగం ఆశిస్తోంది. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రం మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ పనులకు సంబంధించి కూడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నారు. కడెం ప్రాజెక్టు గేట్లకు శాశ్వత మరమ్మతులతో పాటు ప్రాజెక్టు ఎత్తు పెంపునకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరణతో పాటు కాలువలకు నూతన లైనింగ్ పనులు స్వర్ణ వాగు పై మిగిలిపోయిన చోట్ల కొత్త చెక్ డ్యాముల నిర్మాణం విషయంలో నిధులు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే అవకాశం కూడా ఉంది

నిర్మల్ మున్సిపాలిటీకి 100 కోట్లు..!

నిర్మల్ పురపాలక సంఘం అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయలు ప్రకటించే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ పై భరోసాతో ఉన్నారు. గతంలో సీఎం పర్యటన సందర్భంగా నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనేక సభలు కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ తో నిధులు మంజూరు చేయించే అవకాశం ఉందని చెబుతున్నారు. నిర్మల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తయి నిధుల మంజూరు కోసం వేచి చూస్తున్నారు దీనిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తొలి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. దీనికి తోడు పట్టణంలో ఆయా ఆయా వార్డుల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారం కోసం భారీగా నిధులు ప్రకటిస్తారని మున్సిపల్ పాలకమండలితో పాటు జిల్లా కేంద్ర ప్రజలు ఆశతో ఉన్నారు.

అల్లోల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ జిల్లా పర్యటన నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నారు. అధికారిక కార్యక్రమం తో పాటు శ్రేణులతో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డితో మంత్రి అల్లోల మాట్లాడినట్టు సమాచారం. అన్ని ప్రభుత్వ శాఖలతో రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి సీఎం పర్యటనపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు, ఈ మేరకు మంత్రి కలెక్టర్ తో మాట్లాడి సీఎం పర్యటనపై దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.

భారీ బహిరంగ సభ పార్టీ శ్రేణులతోనా... అభివృద్ధి కార్యక్రమాల పేరిటా..?

సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి హాజరవుతున్న నేపథ్యంలో అధికారిక కార్యక్రమం పూర్తయిన తర్వాత భారీ బహిరంగ సభను నిర్వహించే అవకాశం ఉంది అయితే పార్టీ శ్రేణులతోనా... లేదా అభివృద్ధి కార్యక్రమాల పేరిట బహిరంగ సభను నిర్వహించి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని యోచిస్తున్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడు ముధోల్ శాసనసభ్యుడు జి విట్టల్ రెడ్డి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ జెడ్పి చైర్ పర్సన్ విజయలక్ష్మి రామ్ కిషన్ రెడ్డి సహా ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో ముందుగా సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్ణయించారు మొత్తంగా సీఎం కేసీఆర్ పర్యటనను జయప్రదం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read more:

టీబీజేపీలో కేసీఆర్ కోవర్టులు.. అంతర్గత విషయాలు లీక్‌?


Next Story