.కౌన్సిలర్ అభ్యర్థులకు కాశీ యాత్ర

by velandi.Saikiran |   (  Updated:2026-02-12 23:53:56  IST  )

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కౌన్సిలర్ స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులను శిబిరాలకు తరలించారు. ముఖ్యంగా బిజెపి తరఫున పోటీ చేసిన అన్ని మున్సిపాలిటీల అభ్యర్థులను కాశీ యాత్ర పేరుతో క్యాంపులకు తరలించినట్లు ప్రచారం జరుగుతున్నది.

.కౌన్సిలర్ అభ్యర్థులకు కాశీ యాత్ర
X

దిశ, నిర్మల్ ప్రతినిధి: కౌన్సిలర్ అభ్యర్థులకు కాశీ యాత్ర కలిసి వస్తుందా..! ప్రధాన రాజకీయ పక్షాల్లో శుక్రవారం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠను రేపు తున్నది. ఎన్నికల అనంతరం జరిగిన సర్వేలు... అంచనాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క రాజకీయ పార్టీకి స్పష్టతను ఇవ్వకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నిలబడ్డ కౌన్సిలర్ అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి. భారతీయ జనతా పార్టీ నిర్మల్ ఆదిలాబాద్ ఖానాపూర్ బైంసా పురపాలక సంఘాల కౌన్సిలర్ అభ్యర్థులను వ్యూహాత్మకంగా తరలించగా... అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి క్యాంప్ రాజకీయాలు చేసింది. ఇక భారత్ రాష్ట్ర సమితి సైతం కచ్చితంగా గెలుస్తారనుకున్న కౌన్సిలర్ అభ్యర్థులను గుర్తించి క్యాంపులకు తరలించినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా చెన్నూరు ఖానాపూర్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ పురపాలక సంఘాల పరిధిలో ఆ పార్టీ అభ్యర్థులను క్యాంపులకు తరలించినట్లు ప్రచారం జరుగుతున్నది.

అన్ని మున్సిపాలిటీలలో నువ్వా నేనా...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మున్సిపాలిటీలలో ఎన్నికల పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది తూర్పు జిల్లాకు సంబంధించి లక్షెట్టిపేట చెన్నూరు బెల్లంపల్లి మున్సిపాలిటీలలో మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ గట్టి ఆధిక్యతతో సాధిస్తామన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇక ఆసిఫాబాద్ లో ఏ ఒక్క రాజకీయ పార్టీకి మెజారిటీ కనిపించడం లేదు క్యాతన్ పల్లిలో భిన్నమైన ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ పురపాలక సంఘంలో బిజెపి బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డాయి. నిర్మల్ లో బిజెపి కాంగ్రెస్ హోరా హోరీ ఉంది. బైంసాలో ఎంఐఎం ఏకపక్షంగా వచ్చే పరిస్థితులు లేవు. ఖానాపూర్ లో కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ మూడు పార్టీలు అటు ఇటుగా వార్డులు సమానంగా పంచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

క్యాంపులకు తరలిన అభ్యర్థులు...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కౌన్సిలర్ స్థానాలకు పోటీచేసిన అభ్యర్థులను శిబిరాలకు తరలించారు. ముఖ్యంగా బిజెపి తరఫున పోటీ చేసిన అన్ని మున్సిపాలిటీల అభ్యర్థులను కాశీ యాత్ర పేరుతో క్యాంపులకు తరలించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిర్మల్ అభ్యర్థులను హైదరాబాద్ సమీపంలోని తూప్రాన్ ప్రాంతంలో ఒక రిసార్ట్ లో ఉంచినట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి చెన్నూరు కేతన్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మంత్రి వివేక్ హైదరాబాద్ సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ కు తరలించినట్లు ప్రచారం జరుగుతున్నది.

కౌంటింగ్ కు పూర్తి ఏర్పాట్లు...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి శుక్రవారం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. ఇందుకు అవసరమయిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ ఖానాపూర్ బైంసా పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేశారు. మంచిర్యాల కార్పొరేషన్ తోపాటు బెల్లంపల్లి చెన్నూరు కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మంచిర్యాలలో నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ లో అక్కడి మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Next Story