ప్లాటు 'ఢల్'.. గోల్డ్ 'ఫుల్'!

by Ajay Maddhiboyina |

రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల,

ప్లాటు ఢల్.. గోల్డ్ ఫుల్!
X

రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో భూముల ధరలు భారీగా పడిపోయాయి. ఏడాది క్రితం వరకు ఆకాశాన్నంటిన ప్లాట్ల ధరలు ఇప్పుడు సగానికి పైగా తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడం ఇన్వెస్టర్ల ఆలోచనను మార్చేసింది. భూమిపై పెట్టుబడి పెడితే ఎప్పుడు అమ్ముడవుతుందో తెలియని పరిస్థితిలో, బంగారం సురక్షితమైన మార్గంగా కనిపిస్తోంది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే బంగారంపై లక్షల్లో లాభాలు రావడంతో వ్యాపారులంతా బులియన్ మార్కెట్ వైపు క్యూ కడుతున్నారు. ఫలితంగా రియల్ ఎస్టేట్ నమ్ముకున్న చిన్న వ్యాపారులు, బ్రోకర్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ధరల ఈ "దోబూచులాట" మధ్య సామాన్యులు తమ కలల ఇల్లు కట్టుకోవాలా లేక బంగారం కొనాలా అని సతమతమవుతున్నారు.

దిశ ప్రతినిధి, నిర్మల్: పరుగులు తీస్తున్న బులియన్ మార్కెట్ ప్రభావం రియల్ వ్యాపారంపై చూపుతున్నది. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న తల్వేద క్రాస్ రోడ్డు దగ్గరలో నిర్మల్ నుంచి బైంసా వైపు వెళ్లే దారిలో రోడ్డు ఫేస్లో 300 గజాల ఒక ప్లాటు సరిగ్గా రెండేళ్ల క్రితం కోటిన్నర పలికింది. అదే ప్లాటును ఇప్పుడు కోటి రూపాయలు చెబుతున్న కొనేవారు లేరు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న మావల దగ్గర ఏడాది క్రితం ప్లాటు ధర 60 నుంచి 80 లక్షలు పలికింది. అదే ప్లాటు ఇప్పుడు 60 లక్షల లోపు అమ్ముతామన్న కొనేవారు లేరు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి మంచిర్యాల వైపు వెళ్లే దారిలో కొండపల్లి - కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఎకరం ధర 60 లక్షల నుంచి కోటి దాకా పలికింది. ఇప్పుడు ఆ ధర సగానికి పడిపోయింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో గూడెం క్రాస్ రోడ్డు వద్ద గతంలో ఒక ప్లాటు తక్కువలో తక్కువ 50 లక్షలు పలికింది. ఇప్పుడు 40 లక్షలు చెబుతున్న గిరాకీ లేదు.

నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన స్టీలు, సిమెంట్ వ్యాపారం చేసే కో వ్యాపారవేత్త తులం బంగారం 1,02000 ఉన్నప్పుడు లీగల్ గానే 50 గ్రాములు కొనుగోలు చేశాడు. సరిగ్గా ఆరు నెలలు తిరగకముందే బంగారం ధర 1,37,000 దాటింది. ధర భారీగా పెరగడంతో మళ్లీ అమ్ముకున్నాడు. అటు ఇటుగా 20 లక్షలు సంపాదించాడు. బులియన్ మార్కెట్ పై ఆసక్తితో పాటు తెలివి ఉన్న అనేక మంది వ్యాపారులు మార్కెట్లో ఇదే తరహా కొనుగోలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు కిలో వెండి 1,40,000 ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. అది ఇప్పుడు రెండున్నర లక్షలు దాటడంతో నాలుగైదు నెలల తేడాలో భారీ లాభం చూసి సంబరపడుతున్నారు. ఇలా బులియన్ మార్కెట్ పరుగులు పెడుతుండడంతో జనం బంగారు, వెండి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

రియల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు ఎకరాలు, ఆరు ప్లాట్లుగా సాగింది. చిన్న చిన్న వ్యాపారులు సైతం వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి స్థిరాస్తి వ్యాపారం పై పెట్టారు. తాజా పరిణామాలు రియల్ వ్యాపారం పై చూపుతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చేతిలో ఏ కాస్త డబ్బులు జమ అయినా... ప్రపంచ విపణి లో బంగారం, వెండి ధరలు తీవ్రంగా పెరిగిపోతుండడంతో బంగారం వెండి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో క్రమంగా వ్యవసాయ భూములు, రియల్ ఎస్టేట్ ప్లాట్ల ధరలపై ప్రభావం పెరుగుతున్నది. మార్కెట్లో అనేకమంది సలహాదారులు సైతం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల ప్రకారం... బంగారము, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ ప్రచారం చేస్తుండడంతో జనం సైతం అటువైపే ఆసక్తి చూపుతున్నారు

రియల్ వ్యాపారులు, ఏజెంట్లలో ఆందోళన...

తాజాగా జరుగుతున్న బులియన్ మార్కెట్ పెరుగుదల కారణంగా స్థిరాస్తి వ్యాపారం తగ్గుతున్నది దీంతో వడ్డీలకు తెచ్చి వ్యవసాయ భూములు రియల్ ప్లాట్ లపై పెట్టుబడి పెట్టిన వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు మరోవైపు అమ్మకం దారులు, కొనుగోలుదారులకు నడుమ మధ్యవర్తిత్వం చేసే ఏజెంట్లు కూడా ఆందోళన చెందుతున్నారు. బంగారం వెండిపై పెట్టుబడులు పెరుగుతున్న కారణంగా స్థిరాస్తి వ్యాపారం తగ్గడం తమకు నష్టం కలిగిస్తున్నదని వారు ఆందోళన చెందుతున్నారు.

సామాన్యులకు లాభమా..నష్టమా

సామాన్యుడు కొనలేని వ్యవసాయ భూములు ప్లాట్ల ధరలు తగ్గడం వారికి లాభదాయకం అని అంటున్నారు. కొంతమంది ఇల్లు కట్టుకునే వారికి తాజా పరిణామాలు అవకాశంగా మారుతున్నాయి అలాగే వ్యవసాయ భూముల ధరలు తగ్గడం కూడా కొంతమేరకు వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారికి అవకాశం గా మారుతున్నది. ఇక పెళ్లిళ్లు చేయడం, బంగారు వెండి ఆభరణాలపై మోజు ఉన్నవారికి పెరుగుతున్న ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Next Story