నేడు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మహా ధర్నా

by velandi.Saikiran |   (  Updated:2026-02-17 22:31:19  IST  )

మొక్కజొన్న రైతు స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో నేడు తాడ్వాయిలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మహా ధర్నా ఉంటుంది.

నేడు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో మహా ధర్నా
X

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అకాల వర్షాలకు తడిసిన పంటను ఆరబెట్టుకుని కేంద్రాలకు తెచ్చేలోపే కొనుగోలు గడువు ముగియడం అన్నదాతలకు శాపంగా పరిణమించింది. ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, కేంద్రాలు మూతపడడంతో దళారులు అదును చూసి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. సాంకేతిక కారణాలతో వేలిముద్రలు పడకపోవడం, ముఖ్యంగా బిన్నీస్ రకం సాగు చేసిన రైతులకు గడువు నిబంధనలు అడ్డంకిగా మారడంతో వందలాది మంది రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో, తమ గోడును వినిపించేందుకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నేడు తాడ్వాయిలో భారీ మహా ధర్నాకు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించి మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, తాడ్వాయి : ఒకవైపు ఆకాశం నుంచి కురిసిన అకాల వర్షం, మరోవైపు అదును చూసి అల్లేస్తున్న దళారుల మాయాజాలం మధ్య కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల మొక్కజొన్న రైతు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రం ఎప్పుడు తెరుస్తారో అని కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూడటం అన్నదాత వంతయింది.

దళారుల దోపిడీ...

ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. కానీ, తాడ్వాయి మండలంలో కొనుగోలు కేంద్రాల గడువు ముగియడం రైతులకు శాపంగా మారింది. ఇదే అదునుగా భావించిన దళారులు రంగ ప్రవేశం చేసి, క్వింటాల్‌కు కేవలం రూ.1,700నుంచి రూ.1,900 వరకు మాత్రమే ఇస్తామంటూ రైతులను నిలువునా ముంచుతున్నారు. దీనివల్ల ప్రతి క్వింటాల్‌పై రైతు సుమారు రూ.500 నుంచి రూ.700 వరకు నష్టపోవాల్సి వస్తోంది. కష్టపడి పండించిన పంటను దళారుల పాలు చేయలేక, ప్రభుత్వ కేంద్రం తెరుచుకోక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

వేలిముద్రల చిక్కులు, ముగిసిన గడువు..

గతంలో కురిసిన వర్షాలకు మొక్కజొన్న తడిసి ముద్దయింది. దానిని పంట చేనులలో జూళ్లు వేసి ఆరబెట్టుకుని కేంద్రానికి తెచ్చేలోపే ప్రభుత్వం విధించిన మొదటి దఫా గడువు ముగిసిపోయింది. దీనికి తోడు సాంకేతిక కారణాలతో వేలిముద్రలు పడకపోవడంతో వందలాది మంది రైతులు తమ పంటను అమ్ముకోలేకపోయారు. ఇప్పుడు కల్లాల వద్దే రాశులు పోసి, చలిలో నిద్రలు మానుకుని కొనుగోలు కేంద్రం ప్రారంభం కోసం వేచి చూస్తున్నారు.

బిన్నీస్ రైతులపై గడువు నిబంధనల గండం..

తాడ్వాయి మండలంలో మెజారిటీ రైతులు బిన్నీస్ రకం పంటను అధిక మొత్తంలో సాగు చేస్తారు. ఈ పంట కాలపరిమితి దృష్ట్యా సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే కోతలు పూర్తయ్యి మార్కెట్‌కు వస్తుంది. అయితే, ప్రభుత్వం మొదటి దఫా విధించిన మొక్కజొన్న కొనుగోలు గడువు అప్పుడే ముగిసిపోవడం ఈ ప్రాంత రైతులకు శాపంగా మారింది. పంట చేతికొచ్చే సమయానికి కేంద్రాలు మూతపడడంతో మద్దతు ధరకు అమ్ముకుందామనుకున్న బిన్నీస్ సాగుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నేడు భారీ ఎత్తున మహా ధర్నా

ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక రాకపోవడంతో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నేడు తాడ్వాయి మండల కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే స్థానిక తహశీల్దార్‌కు విన్నవించినా స్పందన కరువైంది. దీంతో వందలాది మంది రైతులతో కలిసి మహా ధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Next Story