‘కో-ఆప్షన్’ లొల్లి.. కలెక్టర్ వద్దకు బైంసా మున్సిపల్ గొడవ

by Batti.Sumithra |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పురపాలక సంఘాల కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.

‘కో-ఆప్షన్’ లొల్లి.. కలెక్టర్ వద్దకు బైంసా మున్సిపల్ గొడవ
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పురపాలక సంఘాల కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. సభ్యుల ఎంపిక విషయంలో ఎవరిని ఎంపిక చేయాలో అంతుపట్టక నేతల నడుమ వివాదాలకు కారణమైంది. ప్రతి పురపాలక సంఘంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అవకాశం ఉన్న చోట్ల అభ్యర్థుల నుంచి విపరీతమైన పోటీ పెరగడం... అవకాశం లేనిచోట్ల ప్రతిపక్ష పార్టీలు ఏకమై అధికార పార్టీకి పదవులు దక్కకుండా చేయడం ఇప్పుడు పార్టీలో చర్చకు దారి తీస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, బైంసా, ఖానాపూర్, లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి క్యాతన్ పల్లి, మందమర్రి, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, నస్పూర్ పురపాలక సంఘాలు ఉండగా మంచిర్యాల కార్పొరేషన్ ఉంది. మందమర్రి నోటిఫైడ్ ఏరియా కావడంతో అక్కడ పురపాలక సంఘ ఎన్నికలు జరగలేదు. మిగతా చోట్ల మున్సిపల్ ఎన్నికలు పూర్తయినప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల ప్రక్రియలు ఆలస్యం కావడంతో ఇంకా అనేక మున్సిపాలిటీలకు కో ఆప్షన్ ఎన్నికలు నిర్వహించేందుకు సమయం ఉంది.

బైంసా వివాదం కలెక్టర్ వద్దకు...

నిర్మల్ జిల్లాలోని బైంసా పురపాలక సంఘం కో ఆప్షన్ ఎన్నికల వివాదం జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళింది అక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఇండిపెండెంట్ లు జతకట్టి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్నాయి. కౌన్సిలర్ల సంఖ్య ప్రకారం ఎంఐఎం అత్యధిక స్థానాలు గెలుపొందినప్పటికీ అధికారం దక్కలేదు అయితే కో ఆప్షన్ ఎన్నికల విషయంలో ఎంఐఎం పార్టీ పైచేయిగా నిలిచింది. ఒక కౌన్సిలర్ ప్రోద్బలంతో తమ అభ్యర్థికి ఓటు వేయకుండా ఎంఐఎం బలపరిచిన అభ్యర్థికి ఓటు వేశారని దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎవరు ఒత్తిడి చేసిన ఎన్నికల హాలులో చేయి ఎత్తి బలపరిచిన అభ్యర్థులకే విజయం అవుతుంది కాబట్టి అదే పద్ధతిలో ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కారణంగా బైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం కో ఆప్షన్ సభ్యుల విషయంలో చక్రం తిప్పినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నిర్మల్ లో నలుగురు నేతలు...నాలుగు పదవులు

నిర్మల్ పురపాలక సంఘంలో కో ఆప్షన్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో అనేక వివాదాలకు దారితీసింది. నాలుగు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలకు గాను రెండు మైనారిటీలకు ఇవ్వాలని తొలి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో అంగీకారం కుదిరింది మిగతా రెండు పదవుల విషయంలో పేచీ పడింది. ఈ క్రమంలోనే నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నేతలు తమ అనుకూలురులకు ఒక్కొక్క కో ఆప్షన్ సభ్యత్వ పదవి ఇప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి వ్యూహాత్మకంగా వ్యవహరించి కో ఆప్షన్ సభ్యులు ఎన్నికలు సజావుగా జరిగేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు అయితే నలుగురు నేతలు తమ వారికి ఒక్కొక్కరికి అవకాశం ఇప్పించుకున్నారని... పార్టీలో సీనియర్లను విస్మరించారని కొంత చర్చ జరుగుతున్నది. ఇద్దరు మైనారిటీలకు కో ఆప్షన్ పదవులు ఇచ్చిన విషయంలోనూ అదే మైనారిటీ వర్గంలో ఉన్న కొందరు సీనియర్లు తమకు అవకాశం ఇవ్వకపోవడంపై పార్టీ ముఖ్య నేతల పై ఆగ్రహంతో ఉన్నట్లు కూడా చర్చ జరుగుతున్నది.

లక్షెట్టిపేట, మంచిర్యాల ఏకపక్షంగా...

తూర్పు జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ మంచిర్యాల పురపాలక కార్పొరేషన్ కో ఆప్షన్ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి అక్కడి శాసనసభ్యుడు ప్రేమ సాగర్ రావు సూచించిన వ్యక్తులకే అవకాశం ఇచ్చారు. చిన్న వివాదం లేకుండా పార్టీలో గొడవలు లేకుండా అక్కడ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగతా పురపాలక సంఘాల్లో కో ఆప్షన్ సభ్యులు ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు. ఆసిఫాబాద్ పురపాలక సంఘంలో కాంగ్రెస్ భారత్ రాష్ట్ర సమితి చెరో రెండు పదవులకు అంగీకారం కుదుర్చుకున్నట్లు రాజకీయ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. రెండు వైరి పార్టీలు కో ఆప్షన్ ఎన్నికల విషయంలో అంతర్గత అంగీకారం కుదుర్చుకున్న వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా అక్కడ దుమారం రేపుతున్నది. ఇక మిగిలిన పురపాలక సంఘాల కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు మరో పక్షం రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది

Next Story