మరోసారి తెరపైకి ఆజాద్ ఎన్కౌంటర్ కేసు..!

by Disha Web Desk 20 |
మరోసారి తెరపైకి ఆజాద్ ఎన్కౌంటర్ కేసు..!
X

దిశా, ఆదిలాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆజాద్.. అలియాస్ చెరుకూరి రాజకుమార్ ఎన్ కౌంటర్ కేసు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కోర్టులో విచారణ కొనసాగింది. ఆజాద్ తరపు న్యాయవాది సురేష్ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను న్యాయమూర్తి ఈనెల 30 కి వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసు సంబంధించి న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం 2010 జూలై 2న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్ కె పల్లి జోగాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మద్య ఎన్కౌంటర్ జరిగింది.

ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే మృతి చెందడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు అగ్రనేతలకు మధ్య చర్చలకు స్వామి అగ్నివేష్ మధ్యవర్తిత్వం జరుపుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం అలజడి రేగింది. ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సామాజిక కార్యకర్త అగ్నివేష్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆజాద్ ను పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి కాల్చి వేసినట్లు పేర్కొంటూ అందుకు తగిన ఆధారాలు.. పోస్టుమార్టం నివేదికలు సమర్పించారు. నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు 2011 జనవరి 14 న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

పిటిషన్ లోని అంశాలను సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు ఎన్కౌంటర్పై వాదనలు వినిపించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ న్యాయవాదులతో వాదనలు వినిపించింది. వాదనలను విన్న సుప్రీంకోర్టు 2011 ఏప్రిల్ 15న కేసును సీబీఐకీ అప్పగించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎన్కౌంటర్ ప్రదేశాన్ని అప్పటి జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఎన్కౌంటర్ నిజమైనదే నంటూ 2012లో 192 పేజీల నివేదికను సీబీఐ కోర్టులో సమర్పించారు. ఈ నివేదిక ప్రతులను బాధిత కుటుంబాలకు అందజేయాలని సూచించినా ఎన్ కౌంటర్ లో భాగస్వాములైన పోలీసుల పేర్లు బయటపడే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ నివేదికలను అందుకున్న ఆజాద్ భార్య పద్మ ఆమె తరపు న్యాయవాది సురేష్ 2013 జూలైలో ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ప్రొటెక్ట్ పిటిషన్ వేశారు.

ఆజాద్ ఎన్కౌంటర్ బూటకమని బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. స్వామి అగ్నివేశ్ సైతం 2014 ఫిబ్రవరి 17న జిల్లా కోర్టుకు హాజరై తన వాదనలను వినిపించారు. కోర్టు 2015 మార్చి 24న పిటిషన్ తిరస్కరిస్తూ తీర్పును వెల్లడించింది. ఈ పిటిషన్ రివిజన్ చేస్తూ జిల్లా కోర్టులో ఆజాద్ భార్య పిటిషన్ వేయగా.. వాయిదాలు పడుతూ వచ్చింది. మళ్లీ ఈ ఎన్కౌంటర్ కేసు విచారణను జిల్లా కోర్టు చేపట్టింది. శుక్రవారం ఆజాద్ తరపు న్యాయవాది సురేష్ , ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలను వినిపించగా, జిల్లా కోర్టు కేసు విచారణ ఈనెల 30 కి వాయిదా వేసింది. అయితే కోర్టు తుది తీర్పు పై సర్వత్ర ఆసక్తి నెలకొన్నది.


Next Story

Most Viewed