క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి..

by Kodari Anjali |

క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి..
X

దిశ, మందమర్రి: ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య సూచించారు. ఏప్రిల్ 4, 2026న నిర్వహించనున్న పరోక్ష ఎన్నికల దృష్ట్యా బుధవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం, ఎన్నికల వేదికలను స్థానిక ఏసీపీ, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నోటీసులను ఎన్నికైన కౌన్సిలర్లకు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌన్సిలర్లకు కూర్చునే ఏర్పాట్లు, సమావేశ మందిరంలో సక్రమంగా అమరికలు, భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఎలాంటి లోపాలు తలెత్తకుండా పర్యవేక్షించాలి..

ఎన్నికల సజావుగా జరిగేలా వేదిక, మైక్ వ్యవస్థ, రికార్డు నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్‌కు ప్రత్యేకంగా సూచనలు ఇస్తూ, ఎన్నికల వేదిక పరిసర ప్రాంతాలలో బారికేడింగ్‌ను సక్రమంగా ఏర్పాటు చేసి అనవసర గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయించి రాకపోకలు సులభంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశ ప్రాంగణంలో తాగునీరు, విద్యుత్, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసి, ఎలాంటి లోపాలు తలెత్తకుండా పర్యవేక్షించాలని తెలిపారు. చట్టం–శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా స్థానిక ఏసీపీ, సీఐలు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కు ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, పరోక్ష ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ రమేష్, తహసీల్దార్ సతీష్ కుమార్, ఎస్సై లు శ్రీధర్, నరేష్ మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story