- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ జిల్లాలో యథేచ్ఛగా కల్తీ తిండి దందా
ఆదిలాబాద్ జిల్లాలో హోటళ్లు,రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ధాబాలు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి.

రంగుల విందు.. రోగాల పొందు..
• ఆదిలాబాద్ జిల్లాలో యథేచ్ఛగా కల్తీ తిండి దందా
• ఆరోగ్యంపై దెబ్బ కొడుతున్న ఆకర్షణీయ వంటకాలు
• నిబంధనలు పక్కనపెట్టి నిలువునా ముంచేస్తున్న హోటళ్లు
• నిఘా వైఫల్యం.. హోటల్ నిర్వాహకుల ఇష్టారాజ్యం
దిశ, ఆదిలాబాద్: ఉరుకులు పరుగుల జీవితంలో బయట భోజనాలపై ఆధారపడుతున్న జనాలు తెలియకుండానే రోగాలను ఆహ్వానిస్తున్న పరిస్థితి నెలకొంది.ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోటళ్లు,బార్ అండ్ రెస్టారెంట్లు,ధాబాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నాసిరకం పదార్థాలతో కల్తీ ఆహారం తయారీ పెరుగుతోంది.రుచుల కోసం బయటకు మొగ్గుచూపుతున్న ప్రజలు ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి కార్యాలయాలకు వెళ్లే వారిలో చాలా మంది మధ్యాహ్నం, రాత్రి భోజనాలను హోటళ్లలోనే చేస్తున్నారు. పుట్టినరోజులు,పెళ్లి రోజులు వంటి వేడుకల సందర్భాల్లో కూడా కుటుంబంతో కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం అలవాటైంది.అయితే ఇలా బయట భోజనం చేయడం ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.తాజాగా ఆదిలాబాద్ పట్టణంలోని వరుణ్ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా కుళ్లిపోయిన చికెన్ మాంసాన్ని గుర్తించి సీజ్ చేసి కేసు నమోదు చేశారు.ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేక చోట్ల జరుగుతున్నప్పటికీ కొన్నే వెలుగులోకి వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కలర్,రుచులతో రోగాలు..
రుచుల మాయలో పడుతున్న ప్రజలు కల్తీ ఆహారం బారిన పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు.హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యతలేని పదార్థాల వినియోగం పెరుగుతుండగా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా కల్తీ రాజ్యం విస్తరిస్తోంది.కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఆహార పదార్థాల్లో అధిక మసాలాలు, కృత్రిమ రంగులను వినియోగిస్తున్నారు. నోరూరించే వాసనల వెనుక దాగి ఉన్న నాసిరకం పదార్థాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.హోటళ్లు, ధాబాలు మాత్రమే కాకుండా బేకరీలు,స్వీట్స్ షాపుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
+విచ్చలవిడిగా పెరుగుతున్న హోటళ్లు..
ఆదిలాబాద్ జిల్లాలో హోటళ్లు,రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ధాబాలు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో భారీగా ఆహార కేంద్రాలు వెలుస్తున్నాయి. పట్టణంలోనే అనేక బార్ అండ్ రెస్టారెంట్లు,వందకు పైగా ఫుడ్ అవుట్లెట్లు కొనసాగుతున్నాయి.వీకెండ్స్, సెలవు రోజుల్లో ప్రజలు బయట భోజనాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో వ్యాపారం పెరుగుతోంది.ఈ అవకాశాన్ని కొందరు వ్యాపారులు ధనార్జనే లక్ష్యంగా నిబంధనలు పక్కనపెట్టి వినియోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఎప్పుడో ఒకసారి ఫిర్యాదు అందితేనే తనిఖీలు చేస్తున్నట్లు అధికారుల పర్యవేక్షణపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..
* ప్రత్యూష,పుడ్ సేఫ్టీ అధికారి,ఆదిలాబాద్..
హోటళ్లు,రెస్టారెంట్,స్వీట్ షాపుల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు స్వచ్ఛమైన పదార్థాలను వినియోగించాలి.నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి.ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.జిల్లాలో గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు తరచూ తనిఖీలు చేస్తూనే ఉన్నాం.కాగా ఇప్పటివరకు 5 కేసులు నమోదు చేశాం. ప్రజలు కూడా ప్రభుత్వంగా ఉండాలి. కృత్రిమ రంగులతో ఉన్న ఆహారాన్ని నివారించాలి. కొనుగోలు చేసే ప్రతి ఆహార పదార్ధం పై లేబుల్స్ పరిశీలించి మాత్రమే వినియోగించాలి.






