ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల జోరు!

by Ajay Maddhiboyina |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలతో అడ్మిషన్లలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో 398మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో ఇప్పటికే 283మంది చేరారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల జోరు!
X

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలతో అడ్మిషన్లలో దూసుకుపోతోంది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో 398మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో ఇప్పటికే 283మంది చేరారు. ఇంకా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇక్కడ చదివిన ఎంతోమంది విద్యార్థులు పోలీస్, ఆర్మీ, గ్రూప్ - 4 వంటి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించి కళాశాల సత్తా చాటారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున ప్రహరీ గోడ, అదనపు గదులు, హాస్టల్ వసతి కల్పించాలని ప్రిన్సిపాల్ బి.నాగేశ్వర్ రావు కోరారు.

- దిశ, రెబ్బెన

దిశ, రెబ్బెన : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని ఇంద్రానగర్ గ్రామపంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ విద్యా సంవత్సరంలో కళాశాలలో అడ్మిషన్లు జోరుగా కొనసాగుతున్నాయని ప్రిన్సిపాల్ బి.నాగేశ్వర్ రావు తెలిపారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 398మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రథమ సంవత్సరంలో ఇప్పటికే 283మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని, అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే కొమురంభీం జిల్లాలోనే ఉత్తమ ఫలితాలతో గుర్తింపు పొందిన రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనరల్, వొకేషనల్ గ్రూపుల్లో విద్యార్థులు ప్రతిభ చాటుతూ ప్రతి ఏటా సుమారు 98శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

అనుభవజ్ఞులైన అధ్యాపకులు..

ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం కృషి వల్ల ప్రతి సంవత్సరం ఈ కళాశాల ఉత్తమ ఉత్తీర్ణత సాధిస్తోందని ప్రిన్సిపాల్ వివరించారు. బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపులతో పాటు వృత్తి విద్య (వొకేషనల్) కోర్సుల్లోనూ విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారని, క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. ఇక్కడ చదివిన విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్ (సివిల్), ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, బీఎస్‌ఎఫ్, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, గ్రూప్-4తోపాటు వివిధ ప్రభుత్వ రంగాలు, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.

గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు..

కళాశాలలో ప్రవేశాలను మరింత పెంచేందుకు అధ్యాపక బృందం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాల ప్రత్యేకతలు, సాధించిన ఉత్తీర్ణత ఫలితాలు, అందుబాటులో ఉన్న కోర్సులపై విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరిస్తూ ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వసతుల కల్పనపై ప్రిన్సిపాల్ విజ్ఞప్తి...

విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో కళాశాలకు ప్రహరీ గోడ, ప్రధాన గేటు, అదనపు తరగతి గదులతోపాటు ప్రభుత్వ నిర్వహణలో ఒక వసతి గృహం (హాస్టల్) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్ బి.నాగేశ్వర్ రావు కోరుతున్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి సహకరిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మరింత మెరుగైన విద్యా అవకాశాలు కల్పించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story