సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు

by Taduka Kalyani |

సమాచార హక్కు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రభుత్వ శాఖలు దీనిని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. జి.చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు.

సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు
X

దిశ,మంచిర్యాల: సమాచార హక్కు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రభుత్వ శాఖలు దీనిని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. జి.చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లతో కలిసి జిల్లా అధికారులకు సమాచార హక్కు చట్టం–2005 అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సమాచారం అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అన్నారు. చట్టం ప్రకారం దరఖాస్తుదారునికి 30 రోజులలోపు సమాచారం ఇవ్వాలని, గడువు దాటితే ఉచితంగా అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కమిషన్ ముందు అప్పీళ్ల పరిష్కార సమయాల్లో ప్రజా సమాచార అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. కమిషన్ సూచనలను అధికారులు ఖచ్చితంగా పాటించి, ప్రజలకు సత్వర సేవలు అందించాలన్నారు. అనంతరం జిల్లాలో పెండింగ్ లో ఉన్న అప్పీళ్ల దరఖాస్తులను శాఖల వారీగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, డిసిపి ఎ.భాస్కర్, అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు మరియు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story