‘దిశ’ కథనంతో కదులుతున్న డొంక.. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో నిరుద్యోగులకు టోకరా!

by Jakkula.Mamatha |

ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీల అక్రమాలపై ఇప్పటికే “ఉద్యోగాలు ఫర్ సేల్..!” శీర్షికన దిశ పత్రికలో ఇటీవలే కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

‘దిశ’ కథనంతో కదులుతున్న డొంక.. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో నిరుద్యోగులకు టోకరా!
X

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీల అక్రమాలపై ఇప్పటికే “ఉద్యోగాలు ఫర్ సేల్..!” శీర్షికన దిశ పత్రికలో ఇటీవలే కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో సంబంధిత శాఖలో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాల డొంక కదులుతూ, ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఇటీవలే 51 పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ల వ్యవహారం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేసి నిరుద్యోగులను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై కళాశాల ప్రిన్సిపాల్ కే.అనిత ఫిర్యాదు చేయడంతో ఆదిలాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఎన్.రాజేందర్ గౌడ్ అనే వ్యక్తి సాన్వీ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ పేరిట తాను అధికారి అని చెప్పుకుంటూ నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు తయారు చేసి అభ్యర్థులకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయా ఆర్డర్లను చూపిస్తూ కొంతమంది అభ్యర్థులు కాలేజీకి రావడంతో అనుమానం వ్యక్తమైన అధికారులు పరిశీలించగా అవి నకిలీవని తేలింది.

నకిలీ ఆర్డర్ల కలకలం..

వాస్తవానికి జిల్లా ఔట్ సోర్సింగ్ కమిటీ ద్వారా సాన్వీ సర్వీసెస్, జీపీ ఇన్ఫోటెక్, కావ్య సర్వీసెస్ సంస్థల ద్వారా మొత్తం 51 పోస్టులు ఇప్పటికే భర్తీ అయ్యాయి. అయినప్పటికీ నకిలీ ఆర్డర్లతో మరికొందరు రావడంతో కాలేజీలో కలకలం రేగింది. ఈ ఘటనతో కళాశాల పరిపాలనలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ఇది గర్ల్స్ కాలేజీ కావడంతో భద్రతా అంశాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ విషయం పై టూ టౌన్ సీఐను వివరణ కోరగా.. కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి మిల్కాను ఫోన్ లో సంప్రదించగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదని.. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Next Story