- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరి పుత్రులకు పట్నం టూర్.. విజ్ఞాన యాత్ర పేరుతో నిర్వహణ
ఆదివాసీ బిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా, వారిలో విజ్ఞాన కాంతులు నింపాలన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న ఆలోచన ఆచరణలోకి రానుంది.

దిశ, ఉట్నూర్ : ఆదివాసీ బిడ్డల అభ్యున్నతే లక్ష్యంగా, వారిలో విజ్ఞాన కాంతులు నింపాలన్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్న ఆలోచన ఆచరణలోకి రానుంది. గతంలో ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన జిల్లా ఇన్ చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తానని హామీ ఇచ్చారు. తన ఆలోచనల నుంచి పుట్టిన వినూత్న కార్యక్రమానికి ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ పేరుతో కార్యరూపం దాల్చనుంది. బుధవారం ఉట్నూర్ మండలంలో గొండుగూడలో జెండా ఊపి ఈ విజ్ఞాన యాత్రను మంత్రి జూపల్లి స్వయంగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేవలం పర్యాటక ప్రదేశాలను చూడటమే కాకుండా, ఆదివాసీలు ప్రపంచ పోకడలను, ఆధునిక అభివృద్ధిని, చారిత్రక వారసత్వాన్ని దగ్గరగా గమనించాలన్నది మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన సంకల్పం. వారి ఆలోచనల నుంచి పుట్టిన ఈ ప్రత్యేక విజ్ఞాన యాత్రలో ఉట్నూర్ ప్రాంతానికి చెందిన సుమారు 650 మంది ఆదివాసీలు పాల్గొంటున్నారు. ఆదివాసీల సంస్కృతికి - నగర నాగరికతకు మధ్య వారధిని నిర్మించాలన్న మంత్రి ఆకాంక్ష ఈ కార్యక్రమం ద్వారా నెరవేరనుంది.
యాత్ర సాగనుందిలా..
ఈ విజ్ఞాన యాత్రను మొత్తం మూడు విడతలుగా అధికారులు రూపకల్పన చేశారు. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు సాగే ఈ పర్యటనలో ఒక్కో బ్యాచ్‌కు 200 నుండి 250 మంది చొప్పున మూడు బ్యాచ్‌లుగా హైదరాబాద్‌ను సందర్శిస్తారు. వీరి సౌకర్యార్థం మంత్రి ఆదేశాల మేరకు 5 ప్రత్యేక ఏసీ బస్సులను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బరాదరి, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు.
ఎలాంటి లోటు లేకుండా..
యాత్రకు వచ్చే అడవి బిడ్డలకు బస, భోజన వసతులలో ఎటువంటి లోటు రాకుండా చూడాలని మంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. చారిత్రక కట్టడం తారామతి బరాదరిలో వీరికి బస ఏర్పాటు చేయడంతో పాటు, ఆత్మీయ ఆతిథ్యం అందించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మారుమూల అడవుల నుంచి వచ్చే ఆదివాసీలకు ఈ రెండు రోజుల పర్యటన ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఈ విజ్ఞాన యాత్ర పర్యాటక శాఖ, ఆదిలాబాద్ కలెక్టర్, ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.






