ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ కళ..

by Naga Rani Yarlagadda |

ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ దిశగా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.

ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ కళ..
X
  • విమానాశ్రయానికి రూ.2,278.14 కోట్లు మంజూరు
  • 2,009.23 ఎకరాల సేకరణకు పరిపాలనా అనుమతులు
  • ఎయిర్‌ఫోర్స్, పౌర విమానయానాల ఉమ్మడి వినియోగం కోసం ప్లాన్
  • డిసెంబర్ 31 నాటికి భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ దిశగా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (జేయూఏ) అభివృద్ధికి కావలసిన 2,009.23 ఎకరాల భూసేకరణతో పాటు రోడ్లు, విద్యుత్ లైన్ల డైవర్షన్ తదితర పనుల కోసం ఏకంగా రూ.2,278.14 కోట్లు మంజూరు చేస్తూ రోడ్లు, భవనాల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఏఎఫ్ శిక్షణ.. పౌర విమానయానం.. ఎంఆర్‌ఓ, కార్గో హబ్..

ఈ ప్రాజెక్టును ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ల ఉమ్మడి భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. మొత్తం సేకరించనున్న 2,009.23 ఎకరాల భూమిలో 1,609.23 ఎకరాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పారాట్రూపర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణ, 9,000 అడుగుల రన్‌వే నిర్మాణానికి సేకరించి గ్రాటిస్ ప్రాతిపదికన ఐఏఎఫ్‌కు ఉచితంగా అందజేస్తారు. 400 ఎకరాలను పౌర విమానయాన ఎన్‌క్లేవ్ (ప్యాసింజర్ టెర్మినల్), కార్గో సేవలు, విమానాల మరమ్మతుల కేంద్రం (ఎంఆర్ఓ), హ్యాంగర్ల నిర్మాణం కోసం కేటాయించారు.

అడ్డంకుల తొలగింపునకు భారీ వ్యయం

ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న వివిధ ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ మార్గాలు, రహదారుల మళ్లింపు అంచనా వ్యయాలను ప్రభుత్వం ఆమోదించింది. భూసేకరణ వ్యయం రూ.1,555.11 కోట్లు, 765 కేవీఏ హైటెన్షన్ టవర్ల మార్పిడి (పవర్ గ్రిడ్) కోసం రూ.310.00 కోట్లు, మిషన్ భగీరథ వాటర్ యుటిలిటీస్ మళ్లింపునకు రూ.267.23 కోట్లు, వాగుల డైవర్షన్ (నీటిపారుదల శాఖ) కోసం రూ.57.49 కోట్లు, ఆదిలాబాద్- అనుకుంట ఆర్ అండ్ బి రోడ్డు మళ్లింపునకు రూ. 35.00 కోట్లు, నిర్మాణాల విలువ, కరెంట్ స్తంభాల తొలగింపు తదితరాలకు రూ.3.55 కోట్లతో కలిపి మొత్తం బడ్జెట్ అంచనా రూ.2,278.14 కోట్లుగా లెక్కకట్టారు.

ఈ ఏడాది చివరి నాటికి పూర్తికి డెడ్‌లైన్

గతంలో 700 ఎకరాల సేకరణకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, కొత్తగా 2,009.23 ఎకరాల సేకరణకు గాను భూసేకరణ చట్టంలోని చాప్టర్ 2, 3 నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ భూసేకరణ ప్రక్రియతో పాటు విద్యుత్ లైన్లు, నీటి మార్గాల డైవర్షన్ ప్రక్రియ మొత్తాన్ని 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌ను వికాస్ రాజ్ ఆదేశించారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ రవాణా స్వరూపం మారడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక వేగం పుంజుకోనుంది.

Next Story