Congress: బతిమిలాడేందుకే హరీశ్ ఇంటికి కేటీఆర్.. ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-05-17 11:16:52  IST  )

బీఆర్ఎస్ తీరుపై ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Congress: బతిమిలాడేందుకే హరీశ్ ఇంటికి కేటీఆర్.. ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ప్రతిదాన్ని రాజకీయం చేయడమే పనిగా పెట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) విమర్శించారు. అధికారంలో ఉండగా ఉద్యోగుల సమస్యలు ఏనాడు పట్టించుకోని బీఆర్ఎస్ (BRS) పార్టీకి అధికారం దూరం కాగానే అధికారుల సమస్యలు గుర్తుకు వచ్చాయా ఎద్దేవా చేశారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్.. ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) భేటీపై స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరిస్తుంటే హరీశ్ రావు, కేటీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొడ్డం వారిలో చీలిక తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సుముఖంగా ఉందని ఐఏఎస్ అధికారులతో కమిటీని సైతం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రతిపక్షానికి ఈ ఆందోళన దేనికని నిలదీశారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పడు కేసీఆర్ ఎలా వ్యవహరించారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఆనాడు కేసీఆర్ (KCR) వైఖరి వల్ల 45 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆనాడు ఈ ఉద్యోగ సంఘాల మాజీ నేతలు ఎందుకు పెదవి విప్పలేదని ప్రశ్నించారు.

హరీశ్ రావును బతిమిలాడేందుకే..

హరీశ్ రావు బీఆర్ఎస్ ను వీడనున్నారని వార్తలు వస్తున్నాయని హరీశ్ రావును బ్రతిమిలాడేందుకే కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లారనే ప్రచారం జరుగుతోందన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన విషయం, అది మాకు అవసరం లేదన్నారు. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురే కనిపించారని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఆ నలుగురే కనిపిస్తున్నారని విమర్శించారు. దుష్ప్రచారాలతో ప్రభుత్వ ఉద్యోగులను తప్పుదోవ పట్టించవద్దని బీఆర్ఎస్ నేతలకు చెబుతున్నానన్నారు. శాసనసభ్యత్వం పోతుందేమనని అసెంబ్లీకి రావడం బయట అడపాదడపా మాట్లాడటం తప్ప కేసీఆర్ చేసే కార్యక్రమాలు ఏమీ లేవన్నారు. ప్రజలు ఇప్పటికే ఆ పార్టీని జీరోకు పరిమితం చేశారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతున్నదనేది అగమ్యగోచరంగా మారిందన్నారు.

Next Story