ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: ​ఆది శ్రీనివాస్

by Ajay Maddhiboyina |

ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి మూడు గంటలకు పైగా సమావేశమయ్యారని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: ​ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి మూడు గంటలకు పైగా సమావేశమయ్యారని తెలిపారు. పెండింగ్​ సమస్యలన్నీ పరిష్కరించామని చెప్పారు. అసెంబ్లీ సీఎల్పీ మీడియా సెంటర్​లో శనివారం ఆది శ్రీనివాస్ ​మీడియాతో మాట్లాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సమయం ఇచ్చిన దాఖలాలు లేవు అన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చాం.. బదిలీలు చేశామని పేర్కొన్నారు. ప్రతి నెల మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు.

మాజీ సీఎం కేసీఆర్ ​మొత్తం నాలుగు డీఎలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి పోయాడని పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక ఒక డీఎ ఇచ్చామని, కేసీఆర్ హయాంలో ఉద్యోగులకు సంబంధించిన 8 వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఉద్యోగులు పదవీ విరమణ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని, వయోపరిమితి 61 ఏళ్లకు పెంచి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగుల బదిలీల కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకోవడం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులుతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నవీన్ మిట్టల్, క్రిష్ణ భాస్కర్, లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో సమావేశం అయిందన్నారు. ఉద్యోగ సంఘాలు 57 సమస్యలను ప్రస్తావిస్తే అందులో 45 కి పైగా తక్షణమే పరిష్కరిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ ఏనాడు ఉద్యోగులకు గౌరవం ఇవ్వలేదని, అధికారం పోగానే ఉద్యోగులు కావాల్సి వచ్చిందా..? అని ప్రశ్నించారు.

కేటీఆర్ ​రాజకీయ భవిష్యత్తు కోసమే..

హరీష్ రావు ఇంటికి పోయి కేటీఆర్ మంతనాలు ఆడుతున్నది తన రాజకీయ భవిష్యత్తు కోసమేనన్నారు. హరీష్ రావు పార్టీ నుంచి బయటకు పోతాడని ఇంటికి వెళ్లి బతిమాలుకుంటున్నాడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముందు తన ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని మేం చూసుకుంటాం.. ప్రజా ప్రభుత్వంలో అందరిని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడని అన్నారు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో రాజకీయ అధిపత్య పోరు తారా స్థాయికి చేరిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం తరవాత పార్టీ కేసీఆర్, కేటీఆర్ మాత్రమే నాయకులని సంకేతాలు ఇచ్చారన్నారు. వేదికపైన ఇద్దరి ఫోటోలు మాత్రమే పెట్టుకున్నారని, హరీష్ రావును బతిమాలుకోవడం కోసమే కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లారని ఆది శ్రీనివాస్ ​పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అన్నారు. ఎంఎల్ఏ పదవి కాపాడుకోవడం కోసమే కేసీఆర్ అప్పడప్పుడు అసెంబ్లీకి వస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారతుందని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్​పేర్కొన్నారు.

Next Story