- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధ్యాయులపై అదనపు పని భారం.. తగ్గుతున్న టీచింగ్ సమయం
ప్రభుత్వ స్కూళ్లలో పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు బోధనేతర పనులు చేస్తూ విద్యార్థులకు వెచ్చించాల్సిన సమయాన్ని కోల్పోతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ స్కూళ్లలో పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు బోధనేతర పనులు చేస్తూ విద్యార్థులకు వెచ్చించాల్సిన సమయాన్ని కోల్పోతున్నారు. ఒకప్పుడు పాఠాలు చెప్పడంలో బిజీబిజీగా ఉండే గురువులు నేడు యాప్, ఆన్‌లైన్ పనులతో కుస్తీ పడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. టీచర్లపై బోధనేతర పనుల భారం రోజురోజుకూ పెరుగుతోందని, దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు పలు కార్యక్రమాల్లో బాహాటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వాట్సాప్ ఓపెన్ చేస్తే స్కూల్ డైరెక్టర్ స్థాయి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఆన్‌లైన్ పనులకు సంబంధించి ఆదేశాలు రావడం, వాటికి సంబంధించి రిప్లైలు ఇవ్వడం తమ దినచర్యలో ఒక భాగంగా మారిందని చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం దాదాపుగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో లక్షా ఇరవై వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. విద్యాశాఖ నిర్వహించే వరుస సమీక్షా సమావేశాలతో సతమతమవుతున్నారు. విద్యాశాఖ ఏటా కొత్త బాధ్యతలను అప్పగిస్తుండటంతో, తరగతి గదిలో పాఠాలు చెప్పే సమయం గణనీయంగా తగ్గిపోతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సర్వేలు, ఎన్నికల సమయంలో విధులు, గణాంకాల సేకరణ మొదలగు బోధనేతర పనులు బోధనపై ప్రభావం చూపుతున్నాయని ఇటీవల పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.
శిక్షణలతో గడిచిపోతున్న కాలం..
రాష్ట్రంలో పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం ఆదేశాలను అనుసరించి విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచాల్సిన టీచర్లు అదనపు పనులకు సమయాన్ని కేటాయిస్తున్నారు. విద్యాశాఖ పలురకాల యాప్‌లను ప్రవేశపెట్టడం కూడా ఉపాధ్యాయులకు మింగుడుపడడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభం నుండి పలు శిక్షణలు, వర్క్‌షాప్‌ల పేరుతో ఉపాధ్యాయులను స్కూల్స్ దూరం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. డిజిటల్ బోధన, కొత్త విద్యా విధానంపై అవగాహన వంటి అంశాలపై నిర్వహిస్తున్న వరుస కార్యక్రమలతో టైం వేస్ట్ అవుతోంది. దీనికి తోడు విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించే నిరంతర సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌ల వల్ల టీచర్లు బోధనపై కంటే రిపోర్టులు సిద్ధం చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, విద్యార్థుల హాజరును వివిధ యాప్‌లలో నమోదు చేయడం, జనాభా గణన, ఇతర సర్వేల వంటి బోధనేతర పనులతో పాఠాలు పూర్తికావడం లేదు.
నెలలో పలు కార్యక్రమాలు..
జూన్ నెలలో బడిబాట కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు, అలాగే జూలైలో విత్తనాల సేకరణ, హరితహారం, పాఠశాలల్లో మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తీయడం, స్వచ్చ భారత్, నేషనల్ గ్రీన్ పకార్డ్స్ ఇక ఆగస్టు నెలలో తల్లిదండ్రుల సమావేశాలు, వివిధ పథకాలకు సంబంధించిన వ్యాసరచన, చిత్రలేఖన మండల, జిల్లా స్థాయి పోటీలతో పాటు ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై శిక్షణలు, సెప్టెంబర్ నెలలో కళా ఉత్సవాలు, సైన్స్ సెమినార్లతో పాటు ఇన్ప్సైర్ మనాక్ నామినేషన్లు, రిజిస్ట్రేషన్లు, ఎకో క్లబ్స్, పాఠశాల స్థాయిలో గ్రూపుల ఏర్పాటు బాద్యత తదితర పనుల్లో టీచర్లు నిమగ్నమై ఉంటున్నారు.
భారం తగ్గిస్తే బెటర్..
ఉపాధ్యాయులపై పెరుగుతున్న పనిభారాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. టీచర్ల ప్రధాన బాధ్యత బోధన. కానీ ప్రస్తుతం వారిని క్లర్కులుగా మారుస్తున్నారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించాలని, అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని పలు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బోధనేతర పనులకు ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని, ఉపాధ్యాయులను కేవలం విద్యాబోధనకే పరిమితం చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.






