- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియల్ ఎస్టేట్ ప్రమోషన్లలో నటులు, క్రికెటర్లు.. అనుమతి లేని ప్రాజెక్టులకు ప్రచారం
సంపాదన కోసం బెట్టింగ్ యాప్స్ మాత్రమే కాకుండా.. రియల్ ఎస్టేట్ రంగంలోనూ ప్రముఖులు తమ ఇన్‌ఫ్లూయెన్స్‌ను ఉపయోగిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సంపాదన కోసం బెట్టింగ్ యాప్స్ మాత్రమే కాకుండా.. రియల్ ఎస్టేట్ రంగంలోనూ ప్రముఖులు తమ ఇన్‌ఫ్లూయెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రముఖ సంస్థలకు ప్రచారం చేస్తున్న అగ్ర హీరోలు, హీరోయిన్లు, టీవీ యాంకర్లు, బుల్లితెర నటులు రూ. కోట్లు సంపాదిస్తున్నారు. సదరు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడితే ఎలాంటి ఢోకా ఉండదని హామీ ఇస్తున్నారు. తమ బ్రాండ్ అంబాసిడర్లు అంటూ కంపెనీలు కూడా సదరు సెలెబ్రెటీల పేర్లను వాడుకుంటున్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ లలో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల ఖాతాలు పరిశీలిస్తే ఇలాంటి లెక్క లేనన్ని యాడ్స్ కనిపిస్తున్నాయి. అయితే అన్ని రకాల అనుమతులు ఉన్న లే అవుట్లు, ప్రాజెక్టుల యాడ్స్ లో ప్రముఖులు కనిపించి హామీ ఇస్తే పర్వాలేదు కానీ.. ఎలాంటి పర్మిషన్స్ లేని ప్రాజెక్టుల బ్రోచర్లలో, ప్రకటనల్లో వీరు కనిపిస్తున్నారు. ఓ కంపెనీ ప్రముఖ నటుడు మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు ఫొటోలను పదేండ్లుగా ప్రచారానికి వాడుకుంటున్నది. సదరు కంపెనీపై మోసాలకు పాల్పడ్డారంటూ పలు కేసులు కూడా నమోదయ్యాయి. మరి అలాంటి మోసాలు జరిగినప్పుడు యాడ్స్ లో కనిపించే ప్రముఖులు బాధ్యత తీసుకుంటారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా బెట్టింగ్ యాప్ ల వ్యవహారం మాదిరిగా కొన్ని బిజినెస్ యాప్ లను పలువురు క్రికెటర్లు ప్రమోట్ చేశారు. దాని వల్ల సామాన్యులు మోసపోతున్నారు. తాము కూడా క్రికెటర్ యువరాజ్ సింగ్ చేసిన హౌస్ కన్ స్ట్రక్షన్ ప్రమోషన్ మూలంగా మోసపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడం గమనార్హం. నటులతో పాటు క్రికెటర్లు, ప్రముఖ క్రీడాకారులు కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుండడం చర్చనీయాంశంగా మారింది.
ఒక్కసారి వస్తే చాలు..
రియల్ ఎస్టేట్ కంపెనీలు బ్రోచర్ ఆవిష్కరణలు, భూమి పూజ, లే అవుట్ డిజైన్, లాంచింగ్ ప్రోగ్రామ్స్ గ్రాండ్ గా చేస్తున్నాయి. ఆ సమయాల్లో సెలెబ్రెటీలను ఆహ్వానించి.. వారిని ముందు పెట్టి కార్యక్రమాలు నడిపిస్తున్నాయి. వారితో ఆ ప్రాజెక్టు ప్రాధాన్యతలు, పెట్టుబడికి భరోసా వంటి మాటలను మాట్లాడిస్తున్నారు. ఆతర్వాత ఆ వీడియోలు, ఫొటోలు దశాబ్దాల కాలం హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ లోనే బుల్లితెర నటులు కూడా పాల్గొంటున్నారు. అందమైన బ్రోచర్లలో వారి ఫొటోలు ముద్రించి.. ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. చిన్న నటులే కాదు.. దర్శకులు విశ్వనాథ్, సింగర్ బాలసుబ్రమణ్యం వంటి వారు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రచారాల్లో కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ఎంతో మంది హీరో, హీరోయిన్లు, టీవీ యాంకర్లు, సీరియల్ యాక్టర్లు రియల్ ఎస్టేట్ ప్రచారకర్తలుగా దర్శనమిస్తున్నారు. ఆర్గానిక్ ఫామ్స్, రిసార్టుల పేరిట ఫిల్మ్ మేకర్స్, స్టార్టప్ కంపెనీల యాజమాన్యాలు, ఎంటర్ ప్రెన్యూర్లు, నిర్మాతలు, దర్శకులు, నటులను యాజమాన్యాలు రంగంలోకి దింపుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో.. ఎటూ 50 కి.మీ. దూరంలో అనేక హోర్డింగ్స్ కనిపిస్తుంటాయి. వాటిల్లో సెలెబ్రెటీల ఫొటోలతో యాడ్స్ కనువిందు చేస్తుంటాయి. హీరో, హీరోయిన్లు, సింగర్స్, క్రికెటర్స్, క్రీడాకారులే పెట్టుబడులు పెట్టండంటూ ఆహ్వానిస్తున్నట్లు ఆ యాడ్స్ ఉంటాయి. వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి, మెదక్, నాగార్జున్ సాగర్, విజయవాడ రూట్ లో ఇలాంటి ప్రకటనలు అనేకం దర్శనమిస్తాయి.
బై బ్యాక్ ఆఫర్లకు ఎవరు గ్యారంటీ?
‘ఇలా పెట్టుబడి పెట్టండి.. అలా రెట్టింపు అవుతుంది. 18 నెలల్లోనే 50 శాతం అదనంగా వచ్చేస్తుంది. మేం గ్యారంటీ.. నమ్మడం లేదా? మాకు అగ్రిమెంట్ చేయండి. మీ పేరిట ల్యాండ్ ఉంటుంది. పీడీసీ చెక్కులు ఇస్తాం.. తీసుకోండి’ అంటూ రియల్ ఎస్టేట్ కంపెనీలు బై బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తూ హడావిడి చేస్తున్నాయి. కస్టమర్లతోనే ల్యాండ్ కొనుగోలు చేయించి.. అదే ల్యాండ్ ను డెవలప్మెంట్ కి తీసుకొని లే అవుట్లు చేస్తున్నాయి. ప్రాజెక్టు సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ ఏమిటి? బై బ్యాక్ ఆఫర్ అనుకున్న ప్రకారం చేయకపోతే పరిస్థితి ఏమిటి? పోస్ట్ డేటెడ్ చెక్కులతో న్యాయ పోరాటానికి వీలవుతుందా? అసలు ఇలాంటి బై బ్యాక్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టొచ్చా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. 30, 40 ఫీట్ల రోడ్లు, విద్యుత్తు వంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఎందుకు తీసుకోవడం లేదు? ఫామ్ ల్యాండ్స్ గా అమ్మేస్తూ తిరిగి అగ్రిమెంట్ చేసుకోవడం వెనుక ఆంతర్యమేమిటో వారే చెప్పాలి. బై బ్యాక్ ఆఫర్లను నమ్మి పెట్టుబడి పెడితే 18 నెలల కాలంలోనే ఆ స్థాయిలో ధరలు పెరుగుతాయన్న నమ్మకం లేదంటున్నారు. కానీ ఇలాంటి వాటి ప్రచారం కూడా ప్రముఖ హీరోల పేర్లతోనే సాగుతున్నది. దాంతో కస్టమర్లు బుట్టలో పడుతున్నారు.
ఇలాంటి యాడ్స్ ను ఎలా అంగీకరిస్తున్నారు?
‘మాది క్రెడాయ్, ట్రెడాలో సభ్యత్వం కలిగిన సంస్థ. ఐఎస్ఓ సర్టిఫికెట్ కూడా వచ్చింది. 25 వేల మందికి పైగా విలువైన కస్టమర్లు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే నం.1 రియల్ ఎస్టేట్ కంపెనీ’ అంటూ అందమైన బ్రోచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిలో ఫామ్ ల్యాండ్స్ కొనాలంటూ హీరోల ఫొటోలతో ప్రచారం చేస్తున్నారు. పటాన్ చెరు దగ్గర, ఎల్లాపూర్ లోనే లేక్ వ్యూ ప్రాజెక్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ‘40, 30 అడుగుల రోడ్లు వేస్తాం. విద్యుత్తు సదుపాయం కల్పిస్తాం. ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం తామే ఏర్పాటు చేస్తాం. మూడేండ్ల పాటు తామే మెయింటేన్ చేస్తాం. ఐదారు రకాల పండ్ల మొక్కలు నాటుతాం. గజం కేవలం రూ.7,999. ఆగస్టు వరకే ఈ రేట్ ఉంటుంది. ఆ తర్వాత పెంచేస్తాం.’ అంటూ సదరు హీరో చెప్పినట్లుగా ప్రచారం ఉంటుంది. కానీ అనుమతులు ఉండవు. మరి ఇలాంటి వ్యాపారానికి ప్రచారకర్తలుగా రూ.కోట్లు సంపాదించే హీరోలు ఎందుకు అంగీకరిస్తున్నారన్న డౌట్ వస్తున్నది.
బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ అంటూ బురిడీ
కొన్ని సంస్థలు బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ స్కీం అంటూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నాయి. ‘రూ.80 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదిన్నరలోనే రూ. 1.20 కోట్లు ఇస్తాం. రూ.40 లక్షలు పెట్టండి.. రూ.60 లక్షలు పొందండి’ అంటూ ప్రచారం చేస్తున్నారు. ‘రూ.40 లక్షలు లేకపోతే రూ.25 లక్షలు పెట్టండి. దానికి అనుగుణంగానే లాభాలు వస్తాయి. సెక్యూరిటీ పర్పస్ గా కంపెనీ మీకు ఫామ్ ప్లాట్స్ ఇస్తుంది.’ అంటూ బై బ్యాక్ ఆఫర్ పేరిట కంపెనీలు విస్తృతంగా మార్కెటింగ్ టీమ్స్ ని రంగంలోకి దింపుతున్నాయి. పెద్ద ఎత్తున మూట గట్టుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలను అమలు చేస్తున్నాయి. నమ్మకం లేదా? అయితే మీకు 18 నెలల తర్వాత బ్యాంకులో వేసుకునేటట్లుగా అడ్వాన్స్ చెక్కులు ఇస్తామంటున్నారు. ఇందులో ప్రముఖుల యాడ్స్ ను జోడిస్తున్నారు. ప్రతి బ్రోచర్ లోనూ వారి ఫొటోలు కనిపిస్తున్నాయి. ఆ సెలబ్రిటీలే వీళ్ల ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలని చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ కంపెనీలకు, సదరు సెలెబ్రెటీలకు మధ్య ఏం ఒప్పందం ఉందో తెలియదు కానీ.. అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయాలని ప్రచారం చేస్తుండడం గారడిగా కనిపిస్తున్నది.






