వీబీ జీ రామ్‌జీ చ‌ట్టంతో జ‌రిగే న‌ష్టాన్ని భ‌ర్తి చేసే విధంగా చ‌ర్య‌లు: మంత్రి సీత‌క్క‌

by Prasad Jukanti |

కేంద్రం తెస్తున్న వీబీజీ-రామ్‌జీ చట్టంపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. కూలీలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.

వీబీ జీ రామ్‌జీ చ‌ట్టంతో జ‌రిగే న‌ష్టాన్ని భ‌ర్తి చేసే విధంగా  చ‌ర్య‌లు: మంత్రి సీత‌క్క‌
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీ-రామ్‌జీ (VB GRAM G) చట్టం అమలులోకి వచ్చే నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలపై విస్తృతంగా సమాలోచనలు ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గ్రామీణ పేదల ఉపాధి, జీవనోపాధి ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ పథకం జీవనాధారంగా మారిందని, కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్నీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేశారు. కర్ణాటక, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు వీబీజీ రామ్‌జీ చట్టంపై అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హక్కు, రాష్ట్రాల ఆర్థిక భారం, సమాఖ్య స్ఫూర్తికి సంబంధించిన అంశాలపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు, చర్యలను పరిశీలించాలని ఆదేశించారు.

గ్రామీణ కుటుంబాలు నష్టపోకుండా చర్యలు:

గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఉపాధి హక్కును కాపాడటం మా కర్తవ్యం. కొత్త చట్టం అమలుతో తెలంగాణ కార్మికులు, రైతులు, గ్రామీణ కుటుంబాలు నష్టపోకుండా ఉండేలా అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తున్నాం. కొత్త చ‌ట్టంతో జ‌రిగే న‌ష్టాన్ని భ‌ర్తి చేసే విధంగా చ‌ర్యలు చేప‌డ‌తామని మంత్రి పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈవీబీజీ రామ్‌జీ చట్టంలోని ప్రధాన నిబంధనలు, వాటి ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారం, గ్రామీణ ఉపాధిపై ప్రభావం తదితర అంశాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు.

తెలంగాణపై ప్రభావం:

ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పోలిస్తే, కొత్త చట్టంలో వ్యవసాయ సీజన్‌లలో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇవ్వాల్సి ఉండటం, రాష్ట్రాలకు ముందుగా నిర్ణయించిన నిర్నీత‌ నిధుల కేటాయింపు విధానం అమలు చేయడం, కేంద్ర రాష్ట్ర వ్యయ భాగస్వామ్యాన్ని 60:40 నిష్పత్తికి మార్చడం వంటి అంశాలు తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉందని సమావేశంలో చర్చించారు. గ్రామీణ కార్మికులకు డిమాండ్ మేరకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించే విధానాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా అధికారులు వివరించారు. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం, కేంద్రం నిర్ణయించే నార్మేటివ్ కేటాయింపులకు మించి అవసరమయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే అవకాశాలు, కేంద్ర రాష్ట్ర నిధుల భాగస్వామ్య విధానంలో మార్పులు కోరడం వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

Next Story