పార్టీ అంతర్గత సమస్యలపై నిజనిర్ధారణ తర్వాతే చర్యలు: మహేష్ కుమార్ గౌడ్

by Malleboina Mahesh |   (  Updated:2026-07-10 13:48:28  IST  )

కడియం–సురేఖ వివాదంపై నిజనిర్ధారణకు జగ్గారెడ్డి, సచిన్ సావంత్‌ల అబ్జర్వర్ కమిటీ.. నివేదిక ఆధారంగానే చర్యలన్న టీపీసీసీ చీఫ్!

పార్టీ అంతర్గత సమస్యలపై నిజనిర్ధారణ తర్వాతే చర్యలు: మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని, క్రమశిక్షణ కమిటీ అందరికీ సమానమేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. పార్టీలో చర్చనీయాంశంగా మారిన కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ వ్యవహారం, తుంగతుర్తి నియోజకవర్గ అంశాలపై స్పందించారు. ఈ వివాదాల పరిష్కారం కోసం ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిలను అబ్జర్వర్లుగా నియమించామని తెలిపారు.

వారు విషయ సేకరణ చేసిన అనంతరం పార్టీ అధిష్టానానికి నివేదిక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగానే తదుపరి క్రమశిక్షణ చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు "పదేళ్లు మంత్రిగా ఉండి మీరేం చేశారు? మళ్లీ మూడు నెలల సమయం ఎందుకు ఇవ్వాలి?" అని ప్రశ్నించారు. మీరు కట్టిన ప్రాజెక్టులు కుంగిపోయాయని, దానికి ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వస్తానంటే, ఆ విషయాన్ని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని, ఒక ప్రాంతీయ పార్టీకి రూ.1,400 కోట్లు ఎలా వచ్చాయో విచారించాల్సిందేనని అన్నారు.

Next Story