- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల వినతులపై యాక్షన్ ప్లాన్ సిద్ధం
ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. కొత్త బస్సులు, బస్టాండ్ల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం. నియోజకవర్గాల వారీగా వినతుల స్వీకరణ.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా ఆర్టీసీలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆర్టీసీ సమస్యలపై నిర్వహిస్తున్న ముఖాముఖి సమావేశాల్లో భాగంగా మూడో రోజు శనివారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు అందజేసిన వినతులపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. కొత్త బస్సులు, కొత్త రూట్ల కేటాయింపుతో పాటు బస్టాండ్‌లో టాయిలెట్స్ వంటి కనీస వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. బస్టాండ్ల అభివృద్ధికి ఎమ్మెల్యేలు తమ నిధుల నుంచి సహకరించాలని కోరారు.
ఎమ్మెల్యేల ప్రధాన విన్నపాలు..
కరీంనగర్ ఉమ్మడి జిల్లా: చెన్నూరులో బస్టాండ్ అభివృద్ధి, సింగరేణి ఏరియాలో అదనపు రూట్లు కావాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. కోరుట్ల, మెట్‌పల్లి బస్టాండ్ల ఆధునీకరణతో పాటు హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు కావాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విన్నవించారు. వేములవాడకు అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ పెంచాలని విప్ ఆది శ్రీనివాస్ కోరగా, పెద్దపల్లి డిపో పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. హుజూరాబాద్‌లోని కమలాపూర్ బస్టాండ్‌కు అదనపు నిధులు, రామగుండంలో సిటీ బస్సులు పునరుద్ధరించాలని కౌశిక్ రెడ్డి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా: ఆసిఫాబాద్ పాత బస్టాండ్ పునరుద్ధరణ, గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు పెంచాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి కోరారు. బాసర బస్టాండ్‌ను పుష్కరాల లోపు ఆధునీకరించాలని రామారావు పటేల్, ఖానాపూర్ నుంచి ఆదిలాబాద్, హైదరాబాద్‌కు సర్వీసులు పెంచాలని వెడ్మ బొజ్జు విన్నవించారు. ఇచ్చోడ బస్టాండ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు.
ఖమ్మం ఉమ్మడి జిల్లా: దమ్మపేట బస్టాండ్ పనులు త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే ఆది నారాయణ, మణుగూరు సింగరేణి ప్రాంతానికి అదనపు బస్సులు కేటాయించాలని పాయం వెంకటేశ్వర్లు కోరారు. సరిహద్దు నియోజకవర్గమైన వైరాకు అంతర్రాష్ట్ర సర్వీసులు పెంచాలని రాందాస్ నాయక్ విన్నవించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఉన్నతాధికారులు మరియు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.






