- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫార్ములా ఈ-రేస్ కేసుపై ACB కసరత్తు.. కేటీఆర్, అరవింద్ ఉమ్మడి విచారణ?
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను త్వరలో ఉమ్మడి విచారణ చేసే అవకాశముంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను త్వరలో ఉమ్మడి విచారణ చేసే అవకాశముంది. వారం రోజుల్లోపు వీరిద్దరిని కలిపి ఎంక్వయిరీ చేసేలా ఏసీబీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే అరవింద్ కుమార్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం యూరప్ లో ఉన్న ఆయన ఈ నెల 21న హైదరాబాద్ కు వస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు అరవింద్ కుమార్ ను ఒకసారి, కేటీఆర్ ను రెండు సార్లు ఏసీబీ విచారించింది.
ఆరు నెలలుగా..
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అప్పటి ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. ఏ1 కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిల పేర్లను చేర్చారు. జనవరి8న అరవింద్, 9న కేటీఆర్, 10న బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు ఎంక్వయిరీ చేశారు. ప్రమోటర్ గా వ్యవహరించిన ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ ను జనవరి 18న విచారించారు. ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులను ఫిబ్రవరి 16న వర్చువల్ గా విచారించారు. ఐదు నెలల సుదీర్ఘ విరామ అనంతరం జూన్ 16న కేటీఆర్ ను మరోసారి ఎంక్వయిరీ చేశారు. ఈ నేపథ్యంలో అందరినీ కలిపి ఒకేసారి విచారిస్తే కేసు తుది విచారణకు వస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఇద్దరి సమాధానాలపై..
అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ జరిగిందని, కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారని గతంలో ఏసీబీకి అరవింద్ కుమార్ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్రొసీడింగ్స్ చేశానని బిఎల్ ఎన్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. రెండు సార్లు కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించగా, బిజినెస్ రూల్స్, అగ్రిమెంట్లు, స్పాన్సర్లు, ఆర్థిక శాఖ అనుమతులు ఇలా వివిధ అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. అయితే తన అనుమతితోనే నిధులను చెల్లించినట్లు గత విచారణలో కేటీఆర్ చెప్పినట్లు తెలిసింది. అయితే అరవింద్ కుమార్, కేటీఆర్ లను ఉమ్మడిగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
నేడు సెల్ ఫోన్ అప్పగిస్తారా?
ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సమయంలో వాడిన సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను అందజేయాలని విచారణ సమయంలో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ కు సూచించారు. ప్రస్తుతం అవి తన వద్ద లేవని కేటీఆర్ చెప్పడంతో బుధవారం వరకు అందజేయాలని చెప్పారు. అయితే సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ అప్పగించాల్సిన విషయంలో న్యాయ నిపుణల సలహ మేరకు నడుచుకుంటానని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదు: బీఆర్ఎస్ లీగల్ అడ్వైజర్లు
ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు తీర్పు లేనప్పుడు మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదని బీఆర్ఎస్ లీగల్ అడ్వైజర్లు పేర్కొన్నారు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులూ ఇవే స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. మంగళవారం న్యాయవాదుల బృందం ఆధ్వర్యంలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు అనేది ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్ప, వ్యక్తిగత సంభాషణకు సంబంధించి కాదని స్పష్టం చేశారు. ప్రతి నగదు లావాదేవీ అధికారికంగా బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు, అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదని తెలిపారు. రాజకీయ వేధింపుల కోణంలో మాత్రమే ఫోన్ అడుగుతున్నారని, న్యాయసమతమైన కారణాలు ఏమీ కనిపించడం లేదన్నారు. వ్యక్తిగతంగా వాడే ఫోన్లను ఎలాంటి కోర్టు తీర్పు లేకుండా, వాటితో నేరుగా ఆరోపణల సంబంధం లేనప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతేకాక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ఐటీ చట్టం ప్రకారం, ప్రైవసీ హక్కులకు విఘాతం కలిగించేలా ఉంటుందని తెలిపారు.






