ACB: రాష్ట్రంలో ఏసీబీ జోరు.. సెప్టెంబర్ నెలలో 23 కేసులు నమోదు

by Prasad Jukanti |   (  Updated:2025-09-30 13:08:07  IST  )

తెలంగాణలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది.

ACB: రాష్ట్రంలో ఏసీబీ జోరు.. సెప్టెంబర్ నెలలో 23 కేసులు నమోదు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో (Telangana ACB)దూకుడుగా ముందుకు సాగుతోంది. లంచాల కోసం ప్రజలను వేధిస్తున్న అన్ని శాఖల్లోని లంచగొండు అధికారుల కోసం నిత్యం జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ నెలలో (September roundup) మొత్తం 23 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాజాగా అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. వీటిలో ట్రాప్ కేసులు 11, అక్రమాస్తుల కేసులు 2, క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు 2, సాధారణ ఎంక్వైరీలు 2, ఆకస్మిక తనిఖీలు 2 నమోదు అయినట్లు పేర్కొంది. అవినీతి కేసులో పట్టుబడిన వారిలో 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఒకరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నట్లు వెల్లడించింది. వీరందరిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమైండ్‍కు తరలించామని, వివిధ శాఖల్లోని ట్రాప్ కేసులో రూ.8,91,000 సీజ్ చేశామని తెలిపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ.14,05,83,00 వెలికితీసినట్లు పేర్కొంది.

ఇప్పటివరకు 203 కేసులు:

ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు వివిధ డిపార్ట్ మెంట్లపై రెయిడ్స్ చేసిన ఏసీబీ.. మొత్తం 203 కేసులు నమోదు చేసింది. వీటిలో 119 ట్రాప్ కేసులు, 13 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 20 క్రిమినల్ మిస్‌కండక్ట్ కేసులు, 25 రెగ్యులర్ ఎంక్వైరీలు, 23 సర్ప్రైజ్ చెకింగ్‌లు, 3 డిస్క్రీట్ ఎంక్వైరీలు ఉన్నట్లు ఏసీబీ తెలిపింది. ఈ కేసుల్లో 189 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని వీరిలో 15 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. వీరిని అరెస్టు చేసిన జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు తెలిపారు. ట్రాప్ కేసుల్లో రూ. 42,03,500 స్వాధీనం చేసుకోగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రూ.58,36,18724 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 16న నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తహశీల్దార్ శ్రీనివాస్ రాజును ఏసీబీ పట్టుకుందని ఇతడికి ఒక ఏడాది కఠిన జైలుశిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధించినట్లు ఏసీబీ తెలిపింది. ప్రభుత్వ అధికారులు లంచం కోరితే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేసి చెప్పాలని ఫిర్యాదు చేసే వారి పేరు వివరాలు రహస్యంగా ఉంచబడతాని ఏసీబీ అధికారులు తెలిపారు.

Next Story